రజినీ మాటలను సమర్ధించిన కమల్‌

420

చెన్నై, నవంబర్ 15 (న్యూస్‌టైమ్): కమల్‌హాసన్, రజనీకాంత్ కేవలం విలక్షణ నటులు మాత్రమే కాదు. తాజా రాజకీయాలపై తమదైన శైలిలో స్పందించే గుణం కలిగిన విశ్లేషకులు సైతం. వారిద్దరూ ఒకరి భావాలతో ఒకరు సరిపోల్చుకునే మనస్థత్వం కలిగిన వ్యక్తులు కూడా. తాజాగా తమిళనాడు అధికార పార్టీపై ఈ ఇద్దరూ ఒకరి అభిప్రాయంతో మరొకరు సరిపోల్చుకున్నారు. మక్కళ్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కూడా అయిన కమల్‌ హాసన్‌ తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందన్న సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇక్కడ నాయత్వం లోపించింది. గతంలో మంచి నాయకులు ఉండేవారు. వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కానీ, ఇప్పుడు అలాంటి నేతలు కరవయ్యారు. గతంలో రజినీకాంత్‌ కూడా ఇవే మాటలన్నారు. కానీ, ఆయన చెప్పిన సత్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి జీర్ణించుకోలేకపోయారు. సూపర్‌ స్టార్‌ మాటల్లో నాకెక్కడా తప్పు కనిపించలేదు’’ అని కమల్‌ అన్నారు. గత వారం రజినీ ఓ కార్యక్రమంలో పాల్గొని ‘‘రాష్ట్రంలో సరైన నాయకుడు లేడు. అధికార, ప్రతిపక్షాల వల్ల రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మాటలను తాజాగా కమల్‌ సమర్థించారు.