రైతు సంక్షేమానికి కేసీఆర్ కృషి

0
8 వీక్షకులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రఘునాదపాలేనికి చెందిన మిర్చి పంటలపై రుణాలు పొందిన రైతులకు చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

ఖమ్మం, ఏప్రిల్ 14 (న్యూస్‌టైమ్): రైతు అహర్నిశలు శ్రమించి పండించిన పంటను కాపాడి, రైతుకు వెన్నుదన్నుగా మార్కెట్ యార్డులు నిలుస్తున్నాయి. రైతుల పంటలకు సరైన ధర లేనప్పుడు నిల్వ చేసుకునే సౌకర్యం కల్పిస్తూ, రైతు బంధు పథకం ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు మరింత మేలు చేసి రెట్టింపు ఆదాయం కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవలని కోరారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం, మద్దులపల్లి, మధిర, నేలకొండపల్లి, వైరా వ్యవసాయ మార్కెట్ ల పరిధిలో రూ.18 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, ఖమ్మంకు రూ.5 కోట్లు వచ్చాయని తెలిపారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రఘునాదపాలెం రైతులు మిర్చి పంటలపై రుణాలు పొందిన 10 మంది రైతులకు చెక్కులను వీడీవోల కాలనీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించనున్న వృద్ధి రేటుకు అనుగుణంగా మార్కెట్ యార్డుల సామర్థ్యాన్ని పెంచుతు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా విక్రయించడం కోసం రైతులు తమ సరుకులు పాడవకుండా నిల్వ చేసుకోవడానికి ఎంపిక చేసిన మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు. గత ప్రభుత్వ అసమర్థ, అసంబద్ధ పాలనలో సాగు బరువై, ఆసరా కరవై, గిట్టుబాటు ధర లేక, పంటల ధరలు పాతాళంలోకి చూస్తుంటే, కౌలు రైతులకు రుణాలు లేక, నాలుగు గంటలు కూడా పొలాలకు కరెంట్ రాక, వరుస నష్టాలతో కనారిల్లి, అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్యే శరణ్యంగా తయారైన రైతన్న బతుకులను, దుర్భర స్థితి నుంచి పైకి తీసుకురావటానికి రాష్ట్ర ప్రభుత్వం తొలిరోజు నుంచీ త్రికరణ శుద్ధిగా పని చేయడం వల్లే నేడు రైతులకు రుణాలు అందుతున్నాయని అన్నారు.

2022 నాటికి వ్యవసాయ, అనుబంధరంగాల్లో దేశంలోని తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ మేరకు ప్రణాళిక రచించుకుని, ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ రైతన్న సౌభాగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. మార్కెట్ యార్డుల బలోపేతానికి, రైతులు పండించిన పంటకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ నామ్ (ఎలక్ర్టానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్) అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం రైతులు ప్రయోజన కరంగా చర్యలు చేపట్టిందన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించనున్న వృద్ధి రేటుకు అనుగుణంగా మార్కెట్ యార్డుల సామర్థ్యాన్ని పెంచుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులను పటిష్టపరిచి, దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ రైతులకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయరంగంలో అనుభవం ఉన్న వ్యక్తులు, రైతులను మార్కెట్ యార్డుల చైర్మన్లుగా నియమించడం ద్వారా వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎఎంసీ చైర్మన్ మద్దినేని వెంకట రమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సంతోష్, వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, గోడవర్తి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here