సిద్దిపేట, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్‌కు చేరుకున్నవి. ఇవాళ వాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్‌కు తరలించే కార్యక్రమం చేపట్టారు సీఎం. తదనంతరం, కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో ఇవాళ మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ ఉదయం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు.

ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత, మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చే బర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి. ఈ కార్య‌క్ర‌మాల్లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు తన్నీరు హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీలు, జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫరూక్ హుసేన్, రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సీహెచ్ మదన్ రెడ్డి, మహీపాల్ రెడ్డి, మాణిక్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ప్రత్యేక పధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వి. సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.