గుజరాత్ రైతుల కోసం ప్రధాని మోదీ ఆవిష్కరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గుజ‌రాత్‌లో మూడు కీల‌క ప‌థ‌కాల‌ను ఈ నెల 24న వీడియో కాన్ఫ‌రెన్సు మాధ్య‌మం ద్వారా ప్రారంభించ‌నున్నారు. ప్ర‌ధాన మంత్రి గుజ‌రాత్‌లోని రైతుల కోసం ‘కిసాన్ సూర్యోద‌య యోజ‌న’ను ప్రారంభిస్తారు. యు.ఎన్. మెహ‌తా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాల‌జీ అండ్ రిస‌ర్చి సెంట‌ర్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిట‌ల్‌ను కూడా ఆయ‌న ప్రారంభిస్తారు. అలాగే అహ‌మ‌దాబాద్‌లో గ‌ల అహ‌మ‌దాబాద్ సివిల్ హాస్పిటల్‌లో టెలీ-కార్డియాల‌జీ కోసం అభివృద్ధిప‌ర‌చిన ఒక మొబైల్ అప్లికేష‌న్‌ను కూడా ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ఇదే సంద‌ర్భంలో గిర్‌ నార్‌లో రోప్ వేను కూడా ఆయ‌న ప్రారంభిస్తారు.

కిసాన్ సూర్యోద‌య యోజ‌న‌…

సేద్య‌పు నీటి పారుద‌ల కోసం ప‌గ‌టి పూట విద్యుత్తు స‌ర‌ఫ‌రాను అందించ‌డానికి ‘కిసాన్ సూర్యోద‌య యోజ‌న’ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపాణీ నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఈ ప‌థ‌కంలో భాగంగా రైతులు ఉద‌యం 5 గంట‌లు మొద‌లుకొని రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా సౌక‌ర్యాన్ని పొంద‌గలుగుతారు. ఈ ప‌థ‌కంలో భాగంగా 2023 క‌ల్లా ప్ర‌సార సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను నెల‌కొల్ప‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం 3500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెటును కేటాయించింది.

ఈ ప‌థ‌కంలో భాగంగా 220 కెవి సామ‌ర్ధ్యం క‌లిగిన స‌బ్ స్టేష‌న్ల‌కు తోడు, మొత్తం 3490 స‌ర్క్యూట్ కిలో మీట‌ర్ల (సికెఎమ్) పొడ‌వుతో కూడిన ‘66 కిలో వాట్’ సామ‌ర్ధ్యం క‌లిగిన 234 ట్రాన్సుమిష‌న్ లైన్లను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది. ఈ ప‌థ‌కంలో 2020-21కి గాను దాహోద్‌, పాటన్‌, మహీసాగర్, పంచ్ మ‌హ‌ల్‌, ఛోటా ఉదేపుర్‌, ఖేడా, తాపీ, వ‌ల్సాడ్, ఆణంద్ ల‌తో పాటు గిర్-సోమ్ నాథ్‌ల‌ను చేర్చ‌డం జ‌రిగింది. మిగిలిన జిల్లాల‌ను ద‌శ‌ల‌వారీగా 2022-23 క‌ల్లా ఈ ప్రాజెక్టు కింద‌కు తీసుకురావడం జరుగుతుంది.

ప్ర‌ధాన మంత్రి యు.ఎన్. మెహ‌తా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాల‌జీ అండ్ రిస‌ర్చి సెంట‌ర్‌కు అనుబంధంగా ఏర్పాటైన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిట‌ల్‌ను కూడా ప్రారంభించ‌నున్నారు. అలాగే అహ‌మ‌దాబాద్‌లో గ‌ల అహ‌మ‌దాబాద్ సివిల్‌ హాస్పిటల్‌లోని టెలి-కార్డియాల‌జీ విభాగం కోసం అభివృద్ధిప‌ర‌చిన ఒక మొబైల్ అప్లికేష‌న్‌ను కూడా ఆయ‌న ప్రారంభిస్తారు. యు.ఎన్. మెహ‌తా ఇనిస్టిట్యూట్ ఇక ప్ర‌పంచ శ్రేణి వైద్య సంబంధిత మౌలిక స‌దుపాయాలు క‌లిగిన అతి కొద్ది ఆసుప‌త్రుల‌లో ఒక‌టి కావ‌డ‌ంతో పాటు భార‌త‌దేశంలో హృద‌య వ్యాధి చికిత్స‌కు ఏర్పాటైన అతి పెద్ద ఆసుప‌త్రిగా కూడా పేరును తెచ్చుకోనుంది. యు.ఎన్. మెహ‌తా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాల‌జీ 470 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో విస్త‌ర‌ణ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ విస్త‌ర‌ణ ప‌థ‌కం పూర్తి అయిన త‌రువాత దీనిలో ప‌డ‌క‌ల సంఖ్య 450 నుంచి 1251కి పెర‌గ‌నుంది.

ఈ ఇనిస్టిట్యూట్ దేశం‌లో అతి పెద్ద‌దైన సింగిల్ సూప‌ర్ స్పెషాలిటీ కార్డియేక్ టీచింగ్ ఇనిస్టిట్యూట్‌గా ఖ్యాతిని పొంద‌డమే కాక ప్ర‌పంచంలో అతి పెద్దవైన సింగిల్ సూప‌ర్ స్పెషాలిటీ కార్డియేక్ హాస్పిట‌ల్‌లలో ఒక‌టిగా కూడా కాబోతోంది. ఈ భ‌వ‌నంలో భూకంపాల‌కు త‌ట్టుకొని నిల‌చే నిర్మాణం, మంటలను ఆర్పివేసేందుకు నీటిని చిమ్మే వ్య‌వ‌స్థ‌, ఫైర్ మిస్ట్ సిస్ట‌మ్‌ల వంటి సుర‌క్ష సంబంధిత ముందుజాగ్ర‌త్తల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఈ ప‌రిశోధ‌న కేంద్రంలో ఇసిఎమ్ఒ, హీమాడాయ‌లిసిస్‌, ఐఎబిపి, వెంటిలేట‌ర్లు క‌లిగిన దేశంలో తొలి అధునాత‌న కార్డియేక్ ఐసియు ఆన్ వీల్సు విత్ ఒ.టి. ఏర్పాటు కానుంది. ఈ సంస్థ‌లో 14 శ‌స్త్ర చికిత్స కేంద్రాలు, 7 కార్డియేక్ కాథిటరైజేశన్ ల్యాబుల‌ను కూడా ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.

గిర్‌ నార్ రోప్ వే…

ప్ర‌ధాన మంత్రి ఈ నెల 24న గిర్‌ నార్‌లో రోప్ వేను కూడా ప్రారంభించ‌నుండటంతో గుజ‌రాత్ మ‌రో మారు ప్ర‌పంచ ప‌ర్యాట‌క ముఖ‌చిత్రంలో విశిష్ట‌త‌ను సంపాదించుకోనుంది. ఆరంభ ద‌శ‌లో ప్ర‌తి ఒక్క కేబిన్ 8 మందికి స‌రిపోయేటటువంటి 25 నుంచి 30 కేబిన్‌ల దాకా ఉండబోతున్నాయి. 2.3 కిలోమీట‌ర్ల దూరాన్ని రోప్ వే మాధ్య‌మం ద్వారా 7.5 నిమిషాల వ్య‌వ‌ధిలో అధిగ‌మించేందుకు వీలు ఉంటుంది. దీనికి అదనంగా ఈ రోప్ వే గిర్ నార్ ప‌ర్వ‌తం చుట్టూరా ఉన్న చిక్కని హ‌రిత శోభను సుంద‌ర‌ంగా వీక్షించే అవకాశాన్ని కూడా క‌ల్పించ‌నుంది.