సౌదీ రాయబారి అస్సతితో కేటీఆర్ భేటీ

125
భారత్‌లో సౌదీ అరేబియా రాయబారి సవూద్ బిన్ మహమ్మద్ అస్సతి హైదరాబాద్‌లో తనను కలిసిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తరపున జ్ఞాపికను అందజేసి సత్కరించిన మంత్రి కేటీఆర్. చిత్రంలో హోం మంత్రి అలీ, ఏకే ఖాన్ ఉన్నారు

హైదరాబాద్, డిసెంబర్ 9 (న్యూస్‌టైమ్): భారతదేశంలో సౌదీ అరేబియా రాయబారిగా వ్యవహరిస్తున్న సవూద్ బిన్ మహమ్మద్ అస్సతి తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా సోమవారరం సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కలిశారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో పాటు ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె ఖాన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఇక్కడ అనేక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు సౌదీ రాయబారికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ ఐపాస్ విధానం ద్వారా ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను తెలంగాణ తెవడంలో విజయం సాధించిందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఈ సందర్భంగా కేటిఆర్ కోరారు.

భారత్‌లో సౌదీ అరేబియా రాయబారి సవూద్ బిన్ మహమ్మద్ అస్సతి హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా సోమవారం ప్రగతిభవన్‌లో మంంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన దృశ్యం

ఇందుకోసం అవసరమైతే తెలంగాణలోని మౌళిక వసతులు, ఐటీ, పరిశ్రమల వర్గాల ప్రతినిధులతో కలిసి సౌదిలో పర్యటిస్తామని, తద్వారా ఇక్కడకి సౌదీ పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నిస్తామని, ఇందుకోసం సహాకరించాలని రాయబారి సవూద్‌ను మంత్రి కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నది అని, జీవించడానికి భారతదేశంలో ఉన్న అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం పెద్ద ఎత్తున సౌదీకి ఇక్కడి పౌరులు వెళ్తారని, తెలంగాణకి సౌదీకి మధ్య సాంస్కృతిక సంబంధాలకు మంచి చరిత్ర ఉన్నదని, ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలోహైదరాబాద్ నగరంలో సౌదీ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.