విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నాయకులు అప్పన్న, అప్పారావు

దురాక్రమణదారులపై చర్యలకు సీపీఐ డిమాండు

విజయనగరం, ఆగస్టు 11 (న్యూస్‌టైమ్): బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగిన భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి కోట అప్పన్న, పార్టీ నాయకుడు ఎ. అప్పారావు తదితరులు డిమాండ్ చేశారు. స్థానిక విఆర్వో గొట్టపు సింహాచలం అక్రమ ఆస్తులపై ఏసీబీ దాడులు చేయాలని, ఆయన్ని విచారిస్తే అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని కాలనీవాసులు పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాధితులతో కలిసి పార్టీ నాయకులు మాట్లాడారు. విఆర్వో గొట్టపు సింహాచలానికి సుమారు వంద కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు.

ఆదాయానికి మించిన ఆస్తులు ఆయనకు ఎలా వచ్చాయో తెలియాలంటే ఏసీబీ అధికారులు స్పందించాలని కోరారు. గతంలో బొబ్బిలి వీఆర్వోగా పని చేసినప్పటి నుండి ప్రస్తుతం సీతానగరం విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న ఆయన అక్రమ సంపాదనపై దర్యాప్తు నిర్వహించాలని ఏసీబీ అధికారులను కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ ఇళ్ల స్థలాలను కొంతమంది భూ ఆక్రమణదారులు రెవెన్యూ అధికారుల అండదండలతో తమ ఇష్టానుసారంగా ఇళ్ల స్థలాలను కబ్జా చేసి లక్షలాది రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ దర్జాగా ఉంటున్నారని, అటువంటి వారిపై మండల, జిల్లా స్థాయి అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు, అలాగే బొబ్బిలి శాసన సభ్యుడుకు, తహశీల్దార్‌కూ పలుమార్లు వినతి పత్రం సమర్పించామని, అయినా పెద్దగా ఫలితం లేకుండాపోయిందన్నారు. తమ వత్తిడి కారణంగా బొబ్బిలి ఎమ్మార్వో ఇందిరమ్మ కాలనీలో జరిగిన భూ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటుచేసి, దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లు ఆ కమిటీలో ప్రస్తుతం బొబ్బిలి ఎమ్మార్వో ఆఫీస్‌లో పని చేస్తున్న విఆర్వోలు, వాలంటీర్లను నియమించారని, వాళ్లేమో మొక్కుబడిగా తూతూమంత్రంగా విచారణ పర్తిచేసి నివేదిక సమర్పించారని అప్పన్న పేర్కొన్నారు. ఇంతవరకు వాళ్లు చేపట్టిన దర్యాప్తు బహిర్గతం చేయకుండా ఉంచడం వెనుక అసలు అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అలాగే గొల్లపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ మూడువ ఫేజ్ కింద 2016-2019 సంవత్సర కాలంలో సుమారు గత ప్రభుత్వం 600 పట్టాలు మంజూరు చేయడం జరిగిందని, సదరు 600 పట్టాలు లబ్ధిదారులకు స్థలాలు అందలేదని బినామీ పేర్లతో తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల అండతో గత ఎమ్మార్వో పత్రి గణపతి, నాటి విఆర్ఓ గొట్టపు సింహాచలం, సర్వేయర్ నాగేశ్వరరావు తదితర అధికారులు తమకు ఇష్టం వచ్చిన వ్యక్తులకు సదరు స్థలాలను అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు. ఇందులో భారీ అవినీతి కుంభకోణం జరిగిందని, ఇందిరమ్మ కాలనీలో జరిగిన భూ కుంభకోణం బయటపడాలంటే 2016 నుండి 2019 వరకు గొల్లపల్లి రెవెన్యూ పరిధిలో పనిచేసిన వీఆర్వో, సర్వేయర్లపై తక్షణమే దర్యాప్తు నిర్వహిస్తే అసలు భూ ఆక్రమణ దారులు బయటకు వస్తారని పేర్కొన్నారు.

అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే, ఆక్రమణకు గురైన స్ధలాల వద్దే తాము నిరాహారదీక్షకు సిద్ధపడతామని పార్టీ నాయకులు హెచ్చరించారు.