చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున నిర్మితమైన అతిపెద్ద వంతెనలో కొంత భాగం

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆర్చ్ నిర్మాణం..

చీనాబ్, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు అధికం కశ్మీర్‌లోయను మిగతా ప్రాంతాలతో కలపనున్న బ్రిడ్జి భారతీయ రైల్వే చరిత్రలో నిన్న ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తున నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఆర్చ్ నిర్మాణం పూర్తయింది. జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో 1.3 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (యూఎస్‌బీఆర్ఎల్‌) ప్రాజెక్టులో భాగంగా రూ. 1486 కోట్ల వ్యయంతో దీనిని చేపట్టారు. కశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలతో ఈ బ్రిడ్జి అనుసంధానిస్తుంది. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా నిన్న అత్యంత క్లిష్టమైన ఆర్చ్ నిర్మాణం పూర్తికాగా, మరో రెండున్నరేళ్లలో రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు.

చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున నిర్మితమైన అతిపెద్ద వంతెనలో కొంత భాగం

కాగా, నిన్న ఆర్చ్ నిర్మాణంలోని ప్రధానమైన ముగింపు ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైల్వే మంత్రి పీయూష్ గోయల్, కొంకణ్ రైల్వే చైర్మన్ సంజయ్ గుప్తా వీక్షించారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తైన ఈ బ్రిడ్జి నిర్మాణం మరో ఏడాదిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉత్తర రైల్వేకు ఇదో చారిత్రాత్మక రోజని, యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్టును పూర్తిచేయడంలో ఇదో మైలురాయి అని అశుతోష్ గంగాల్ పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు.

బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కు, 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 66 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది. ఆర్చ్ మొత్తం బరువు 10,610 టన్నులు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, అత్యంత తీవ్రతతో సంభవించే భూకంపాలను కూడా ఈ వంతెన తట్టుకుంటుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి నిర్మాణం ఇదే తొలిసారని గంగాల్ పేర్కొన్నారు. అయితే, ఈ చీనాబ్ వంతెనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున నిర్మితమైన అతిపెద్ద వంతెన

జమ్మూ కశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ భారీ ఉక్కు వంతెన నిర్మాణం పూర్తి కావొచ్చినట్లు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు. 476 మీటర్ల పొడవులో విల్లు ఆకారంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. మౌళిక వసతుల కల్పనలో మరో అద్భుతం రూపుదిద్దుకుంటోంది. మరో ఇంజినీరింగ్ మైలురాయి దిశగా భారతీయ రైల్వే పరుగులు పెడుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరుతెచ్చుకోనుంది. అంటూ కేంద్ర మంత్రి గోయల్ ట్వీట్ చేశారు.

దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఈ విల్లు వంతెనను నిర్మిస్తున్నారు. 2017 నవంబర్‌లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి. 476 మీటర్లు విల్లు ఆకారంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1,315 మీటర్లు. 17 వ్యాసార్థాలల్లో దీనిని నిర్మిస్తున్నారు. కాగా దీనికయ్యే అంచనా వ్యయం రూ.1,250 కోట్లు. ఉధంపూర్‌- శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే సెక్షన్‌లో ఈ లైన్‌ను దీనిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి జమ్మూ కశ్మీర్‌లోని బక్కల్‌, కౌరి మధ్య చీనాబ్‌ నదిపై అనుసంధానంగా ఉంటుంది.

నిర్మాణ సమయంలో వంతెన దృశ్యం

ఈ వంతెనను జమ్మూ కశ్మీర్‌లోని యుఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తోంది. చీనాబ్ వంతెనను నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్ (324 మీటర్లు) కంటే 35 మీటర్ల పొడవు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే, జమ్మూ కశ్మీర్‌లోని లోయ ప్రాంతాలకు రవాణా మార్గం సులభం అవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మొత్తానికి చీనాబ్ వంతెన భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెనగా ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

ఇది జమ్మూ కశ్మీర్‌‌లోని రేసి జిల్లాలో, బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది. వంతెన పూర్తయినప్పుడు 1,263 మీటర్ల (4,144 అడుగులు) పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల (1,570 అడుగులు)తో, చీనాబ్ నదిపైన 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో, కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల (2,130 అడుగులు) పొడవుగా ఉంటుంది. ఈ వంతెన అనేక వంతెనల, సొరంగాల భాగం దీనిని జమ్మూ కశ్మీర్‌లోని యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్ కత్రా-లావోలి విభాగం నిర్మించింది. ఈ లింక్‌లో మరో చిన్న ఆర్చి వంతెన కత్రా, రేసి మధ్య 657 మీటర్ల (2,156 అడుగులు) పొడవుగా, 189 మీటర్ల (620 అడుగులు) ఎత్తుతో అంజి ఖాద్ వంతెన నిర్మితమైంది.

వాస్తవానికి చీనాబ్ బ్రిడ్జ్ డిసెంబర్ 2009కి పూర్తయ్యేలా నిర్ణయించారు. అయితే, సెప్టెంబర్ 2008లో చీనాబ్ వంతెన స్థిరత్వం, భద్రత మీద ఆందోళన చెంది దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ వంతెన పని 2010లో పునఃప్రారంభించారు. నిర్మాణం 2015కి పూర్తికాగలదని ఇది పూర్తయితే చీనాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలో ఎత్తైన రైలు వంతెన అవుతుందని భావించారు. అయితే, కాస్త ఆలస్యంగానైనా ఈ వంతెన ఇప్పుడు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది.

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ సూచనల మేరకు చీనాబ్ వంతెన డిజైన్‌ ప్రొవైడర్‌గా సివిల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌ మాధవీలతను నియమించారు. ఒక తెలుగు మహిళకు భారత అత్యున్నత ప్రాజెక్టు నిర్మాణంలో అవకాశం రావడం గర్వించదగ్గ విషయం. ఇక, జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించాలని నిర్ణయించింది.

దీనిని చీనాబ్ బ్రిడ్జి ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. సుమారు రూ.552 కోట్ల అంచనా వ్యయంతో కొంకణ్ రైల్వే ఈ వంతెనను నిర్మించింది. బారాముల్లా-జమ్మును కలిపే ఈ వంతెన నిర్మాణం అందుబాటులోకి వస్తే, ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పడుతున్న ఆరున్నర గంటల సమయం సగానికి తగ్గిపోతుంది. దీని నిర్మాణం పూర్తయ్యేసరికి దీని ఎత్తు 359 మీటర్లకు చేరుతుందని అంచనా. అది ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న ఈఫిల్‌ టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ.

భూకంపాలు, బలమైన ఈదురుగాలులను తట్టుకునేలా దీని నిర్మాణం జరగడం వల్ల నిర్ణీత గడువు కంటే కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. 2002లోనే దీని నిర్మాణం ప్రారంభమైనా బలమైన ఈదురుగాలులను తట్టుకోగలుగుతుందా? అన్న అనుమానంతో 2008లో నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత రెండేళ్లకు డిజైన్‌పై సందేహాలు వీడడంతో 2010లో నిర్మాణం మళ్లీ మొదలైంది.

దీని నిర్మాణానికి 25వేల టన్నుల ఇనుము అవసరమవుతుందని అంచనా వేశారు. అయితే, ఆ అంచనా కూడా మించింది. ఇంద్రధనుస్సు (ఆర్క్) ఆకారంలో నిర్మించిన ఈ వంతెన విడిభాగాలను చీనాబ్ నది పక్కనే తయారుచేసి రెండు కేబుల్ కార్ల సాయంతో వంతెనకు జత చేశారు.