దరఖాస్తుల సవరణలకు వెసులుబాటు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అక్రిడిటేషన్‌ల జారీ ప్రక్రియలో భాగంగా కొత్త దరఖాస్తుల సమర్పణ, పేర్ల మార్పులు, చేర్పుల విషయంలో మరొకసారి అవకాశం కల్పిస్తూ వెబ్‌సైట్‌ (http://ipr.ap.gov.in/login)ను అందుబాటులో ఉంచింది రాష్ట్ర సమాచార, పౌర సంంబంధాల మంత్రిత్వ శాఖ. గత ఏడాదే కొత్త అక్రిడిటేషన్ల మంజూరుకు ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలో కొత్త కార్డుల జారీ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి, జర్నలిస్టు సంఘాలను కాదని, అధికారులతో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ ప్రతి మూడు నెలలకు ఒకసారి పాత కార్డుల గడువును పొడిగిస్తూ వచ్చిన అధికారులు డిసెంబర్‌ 31తో ముగుస్తున్న కార్డుల స్థానంలో కొత్త కార్డులను జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అందులో భాగంగానే ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణకు వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ధృవపత్రాలు అప్‌లోడ్ చేయడంతో సిఫార్సు లేఖల్లో పేర్ల మార్పులకూ వెసులుబాటు కల్పించారు. మీడియా సంస్థ మారిన పాత్రికేయులు యాజమాన్య సిఫార్సు లేఖలో సహా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ముగుస్తున్నందున కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.ipr.ap.gov.inను అందుబాటులో ఉంచడమైందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు అదే లాగిన్ ఐడీ ఉపయోగించి, తమ దరఖాస్తులకు అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

గతంలో తమ దరఖాస్తుతో పాటు సమర్పించిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్‌లను పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. గత దరఖాస్తులలో అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు పీడీఎఫ్ ఫార్మెట్లో అప్‌లోడ్ చేయనందున, వారు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను మళ్లీ అప్‌లోడ్ చేసుకునేందుకు గతంలో కూడా ఒకసారి అవకాశం కల్పించిన అధికారులు తాజాగా, చివరి అవకాశంగా మరోసారి మార్పులు, చేర్పులకు వెసులుబాటు కల్పించారు.

అలాగే, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రస్తుతం మీడియా సంస్థ మారి ఉంటే, అటువంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత యాజమాన్యం వారి సంస్థలలో పనిచేస్తున్న పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడానికి రికమండేషన్ లేఖలను మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి సవరించిన లేఖలను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ అవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకుని, పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయనివారు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేసి నకలు కాపీలను సంబంధిత సమాచార శాఖ కార్యాలయాలలో అందజేయాల్సి ఉంటుంది.