ఏయూలో ‘అల్లూరి’ పరిశోధన కేంద్రం ప్రారంభం

441

విశాఖపట్నం, జులై 4 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన సెంటర్‌ ఫర్‌ అల్లూరి సీతారామరాజు హిస్టరీ అండ్‌ ట్రైబల్‌ స్టడీస్‌ కేంద్రాన్ని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కేంద్రంలో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి తొలుత పూలమాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం వీసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుని పేరుతో ఇప్పటి వరకు ఏ విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, ఈ ఘనత సాధించిన వర్సిటీగా ఏయూ ఖ్యాతిగాంచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖలలో సమన్వయం చేస్తూ కేంద్రానికి అవసరమైన నిధులను సాధించాల్సి ఉందన్నారు. తన జీవితాన్ని దేశంకోసం త్యాగం చేసిన మహనీయుని జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నారు.

రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా అల్లూరి సీతారామరాజు నిలుస్తారన్నారు. స్వాతంత్య్ర సముపార్జనకు అల్లూరి చేసిన కృషిని వివరించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో సాగాలని సూచించారు. కేంద్రం సంచాలకులు ఆచార్య విజయలక్ష్మి మాట్లాడుతూ త్వరలో కేంద్రం ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు, సదస్సులు, సర్టిఫికేట్‌ కోర్సులను నిర్వహిస్తామన్నారు.

దేశంలో 8 శాతం ఉన్న ఆదివాసీలకు ఉపయుక్తంగా కేంద్రం పనిచేస్తుందన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రామమోహనరావు మాట్లాడుతూ గిరిజనుల సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వికాసానికి అల్లూరి ఎనలేని సేవలు అందించారాన్నారు. ప్రభావవంతమైన భావ ప్రకటన చేయడంలో ఆయన దిట్టగా నిలుస్తారన్నారు. దార్శనికత కలిగిన నాయకుడిగా, పోరాట యోధునిగా అల్లూరి నిలుస్తారన్నారు.

విశ్రాంత ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా విద్య, మహిళా సాధికారతకు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను వివరించారు. అల్లూరి ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరిశోధకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.