సమాజ సంస్కరణకు సాహిత్యామే ఆయుధం

29436

గుంటూరు: కేవలం తెలుగు వారే కాకుండా యావత్ భారతావణిలో విలువలతో కూడిన అత్యుత్తమ కవిత్వాన్ని ఇష్టపడే వారి ఆరాధ్యుడు గుర్రం జాషువా అనడంలో సందేహం లేదు. అంతలా ఆయన తన రచనలతో చదువరులను విశేషంగా ఆకట్టుకున్నారు. 1895 సెప్టెంబర్ 28వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు జాహువా.

తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబ. తండ్రి యాదవ కులం వారైతే, తల్లి మాదిగ కులం. ఇరు కుటుంబాలు వారిని వెలివేశాయి. అలాంటి కుటుంబ పరిస్థితుల్లో జన్మించి బాల్యం నుండీ కుల వివక్షకు గురైన జాషువా సమాజ సంస్కరణకు సాహిత్యాన్నే ఆయుధంగా మలచుకున్నారు. తెలుగునాట ఒకవైపు భావకవిత్వం, మరోవైపు, జాతీయోద్యమ సాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక అసమానతలపై, కుల వివక్షపై సాహితీ ఖడ్గాన్ని ఝళిపించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా.

గబ్బిలం, ఫిరదౌసి, రుక్మిణీ కల్యాణం, కోకిల, శివాజీ ప్రబంధం, భారత వీరుడు, సఖీ, సాలీడు, స్మృతి తదితర 30కి పైగా గ్రంథాలను జాషువా వెలువరించారు. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు, విశ్వనరుడ నేను’’ అంటూ తన గురించి తాను ఎంతో గంభీరంగా, గర్వంగా ప్రకటించుకున్నాడు గుర్రం. సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ రాణించినప్పటికీ పద్యకవిగానే ప్రసిద్ధులయ్యారు జాషువా.

ఆయన రచించిన క్రీస్తు చరిత్ర గ్రంథానికి 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం 1970లో పద్మభూషణ్‌ ప్రకటించింది. జీవితాంతం సుకవిత్వం చెప్పి, జనుల నాలుకలపై నిలిచిపోయిన జాషువా, 1971 జూలై 24న కన్నుమూశారు.