కాకినాడ, అక్టోబర్ 18 (న్యూస్‌టైమ్): తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస ఎస్.బి.ఐ. శాఖలో నకిలీ బంగారు ఆభరణాలను పెట్టి రుణాలు మంజూరు చేసి కోటి రూపాయలు కాజేసిన కేసులో అదే బ్యాంకుకు చెందిన ఉద్యోగి బులుసు వీర వెంకట సత్యసుబ్రహ్మణ్యశర్మను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకులో బినామీ పేర్లతో కాజేసిన కోటి రూపాయలు సొంత అవసరాలకు వాడుకున్న వైనం సుబ్రహ్మణ్యశర్మ ఇటీవల బ్యాంకులో జరిగిన ఇంటర్నల్ ఆడిట్లో బయటపడింది.

ఇల్లాలు, ప్రియురాలితో కలిసి చోరీలు

ఇదిలావుండగా, కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన శిరువెళ్ల పరిధిలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, ఎర్రగుంట్లలోని శ్రీకృష్ణ మందిరం, ఆళ్లగడ్డ పరిధిలోని బత్తలూరులో చెన్నకేశవస్వామి ఆలయాల చోరీల మిస్టరీకి తెరపడింది. అంతర్రాష్ట్ర దొంగ అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఎరుకలి నల్లబోతుల నాగప్ప అలియాస్‌ రాజు అలియాస్‌ నాగరాజు (42) మహానంది మండలం గాజులపల్లికి చెందిన ఇతని ప్రియురాలు లావణ్య అలియాస్‌ సుధ (30), భార్య ప్రమీల (33)లను అరెస్టు చేసిన పోలీసులు కడప జిల్లా – 4, అనంతపురం – 11, ప్రకాశం – 2 ఆలయాల్లో చోరీలకుపాల్పడ్డారని తెలిపారు. వీరి నుంచి రూ. 12.30 లక్షల విలువ చేసే 164 గ్రాముల బంగారు, 15.360 కేజీల వెండి ఆభరణాలు, రూ.23780 నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.