మరింత పటిస్టంగా లాక్‌డౌన్

124

శ్రీకాకుళం, ఏప్రిల్ 21 (న్యూస్‌టైమ్): పాజిటివ్ కేసులు నమోదుకానప్పటికీ కరోనావైరస్ పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉన్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ జిల్లాలోనూ పటిష్టవంతంగా కొనసాగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయ పనులకు తప్ప ఎటువంటి మినహాయింపు లేదన్నారు. మండల మధ్య కదలికలను కూడా నియంత్రించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కేవలం ఏ మండల పరిధిలోని ప్రజలు ఆ మండలానికే పరిమితం కావాలని, ఈ మేరకు గ్రామస్థాయి అధికారులను, వాలంటీర్ వ్యవస్థనూ అప్రమత్తం చేశామన్నారు.

వ్యవసాయం, చిరు వ్యాపారులకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మండల ప్రజలు బయటకు రాకూడదని తెలిపారు. మండల స్థాయిలో చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులు అదే మండలానికి చెందినవారై ఉండాలని, వారిని మాత్రమే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్‌లో అనుమతి పొందిన పరిశ్రమలు మాత్రమే లాక్‌డౌన్‌లో నడుస్తాయని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, ఆహార ఆధారిత పరిశ్రమలు మాత్రమే పనిచేస్తాయని, వ్యక్తుల మధ్య దూరం పాటిస్తూ తమ సంస్థలను నిర్వహించుకునే వాటిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు.

శానిటైజర్లు, బ్లీచింగ్ చల్లడం వంటి అన్ని రకాల సురక్షిత చర్యలు చేపట్టాలని, 3 వేల రాపిడ్ టెస్ట్ కిట్స్ జిల్లాకు వచ్చాయని, విఎల్ఎం లాబ్‌లో టెస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుండి రాజాం మండలం వచ్చిన వ్యక్తికి నిన్న పరీక్షలు చేసామన్నారు. తుది టెస్టులు ఇప్పటి వరకు కాకినాడకు పంపించామని, ఇకపై రిమ్స్‌లోనే చేయనున్నామన్నారు. లాక్‌డౌన్‌లో ప్రజలు సహకరించాలని, వీధుల్లో ప్రజలు లాక్‌డౌన్ పాటించడం లేదని, వ్యాధి లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఇతర ప్రాంతాల నుండి వస్తున్నవారి ద్వారా ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. మే 3 తరువాత కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కలెక్టర్ గుర్తుచేశారు.

జిల్లా నుండీ 2460 నమూనాలు సేకరించడం జరిగిందని, ఇప్పటి వరకూ 1741 నివేదికలు వచ్చాయని, 724 నివేదికలు రావాల్సి ఉందన్నారు. రోజుకు 3 నుండి 4 వందలు పరీక్షలు జరుపులున్నామని, జిల్లాలో 3718 మందిలో లక్షణాలు గుర్తింపు కోసం పరీక్షలు జరిపామన్నారు. విశాఖపట్నం డయాలిసిస్‌కు రోగులు వెళ్లేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికి 92 మంది డయాలిసిస్ చేసుకున్నారని, సోంపేట, పలాసలో కూడా 5 బెడ్లు చొప్పున అందుబాటులో ఉంచామన్నారు. ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యంత్రాంగానికి సహకరించాలన్నారు. అత్యవసరం లేనప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అంతర్ జిల్లా, రాష్ట్ర కదలికలు మరింత కఠినతరం చేశామన్నారు. ఇతర ప్రాంతాల నుండి ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని, చెన్నై నుంచి వచ్చే మత్స్యకారుల కోసం 40 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు.

6 బోట్లు సీజ్ చేసి 82 మందిని క్వారంటైన్‌కు పంపించామని తెలిపారు. క్రిమినల్ కేసుల వలన ఇతరులు రావడానికి సాహసించడం లేదని, తీర ప్రాంతంలో నిఘా కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు. మీడియా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.