నెరవేరిన సుదీర్ఘ నిరీక్షణ

755

ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలించింది. క్రికెట్ ఆటకే మూల స్తంభంలాంటి ఇంగ్లండ్ కేంద్రంగా ఈసారి జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠతో కూడిన గెలుపును ఆ దేశ జట్టు సొంతం చేసుకుని పుట్టింట పులకింత ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. మ్యాచ్‌ టై, సూపర్‌ ఓవరూ టై అయిన హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్‌ను గెలిపించిన స్టోక్స్‌ ఆటతీరును మెచ్చుకోకుండా ఉండలేరు ఏ క్రికెట్ ప్రియుడూ. ఎన్నో దశాబ్దాల కలకు తోడు సుదీర్ఘ నిరీక్షణ, జట్టు సభ్యుల పోరాటం, తపన, శ్రమ వెరసి సొంత గడ్డపై జరిగిన ఐసీసీ ప్రపంచ కప్‌ను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది.

ఇన్నేళ్ల వేదన తీరేలా, మనసు నిండేలా ఇంగ్లాండ్‌ అనుకున్నది సాధించింది. జగజ్జేతగా నిలిచి తనివితీరా, సగర్వంగా తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. తొలి కప్పే కాదు, నరాలు తెగే ఉత్కంఠలో అది గెలిచిన తీరు ఇంగ్లాండ్‌ విజయాన్ని చిరస్మరణీయం చేస్తోంది. ఆ జట్టును గెలిపించిన స్టోక్స్‌ ఓ సూపర్‌ హీరోగా నిలిచిపోతాడు ఎప్పటికీ! అన్ని ఫైనల్స్‌లా ఈ ఫైనల్ మామూలుది మాత్రం కాదు. కిక్కిరిసిన మైదానంలో గుండె చప్పుళ్లూ వినిపించేంత ఉత్కంఠత నేపథ్యంలో సాగిన పోరులో విజయం చివరికి అదృష్టం రూపంలో ఇంగ్లండ్‌ను వరించింది.

అటు ఇంగ్లాండ్‌తో ఇటు న్యూజిలాండ్‌తో విజయలక్ష్మి దోబూచులాడుతుంటే ప్రేక్షకులంతా మునివేళ్లపైనే ఆసనాలు వేశారు. మన జట్టే లేనప్పుడు ఫైనల్‌తో మనకేం పని అనుకున్న భారతీయులూ టీవీలకు అతుక్కుపోయారు. నభుతో నభవిష్యత్‌ అన్న రీతిలో సాగిన తుదిపోరుతో ఉత్కంఠ, ఉద్వేగంతో ఊగిపోయారు. బాధ్యతనంతా భుజాలపై వేసుకుంటూ స్టోక్స్‌ అద్భుతంగా పోరాడిన వేళ ఆశలు సన్నగిల్లిన స్థితి నుంచి ఇంగ్లాండ్‌ స్కోరును సమం చేయడమే ఉత్కంఠను తార స్థాయికి తీసుకెళ్లగా ఆపై సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడం మ్యాచ్‌ను ప్రపంచకప్‌ ఫైనల్స్‌కే తలమానికంగా మార్చింది.

సూపర్‌ ఓవర్లోనూ స్కోర్లు ఒక్క‘టై’నా మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుగా ఇంగ్లాండే విజేతగా నిలిచింది. ఆఖరి బంతి పూర్తయిన క్షణాణ ఆతిథ్య జట్టు సంబరాల్లో మునిగిపోగా కివీస్‌ నిరాశలో మునిగిపోయింది. అయినా సర్వశక్తులు ఒడ్డిన న్యూజిలాండూ విజేతే! ఎవరైనా కాదంటారా? అంచనాలు నిలబెట్టుకుంటూ, ఆశలను నిజం చేసుకుంటూ ఆతిథ్య ఇంగ్లాండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆదివారం నరాలు తెగే ఉత్కంఠమధ్య అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.

నికోల్స్‌ (55; 77 బంతుల్లో 4×4), లేథమ్‌ (47; 56 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో మొదట న్యూజిలాండ్‌ 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (84 నాటౌట్‌; 98 బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ను టై చేసింది. 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియగా మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఫైనల్‌ మ్యాచ్‌ను చూసినవారెవ్వరూ స్టోక్స్‌ ఆటను ఎప్పటికీ మరిచిపోలేరు. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు అతడు.

రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అతడే! దాదాపు విజయాన్ని అందుకున్నట్లే కనిపించిన న్యూజిలాండ్‌కు ఏకైక అడ్డంకిగా నిలిచాడు స్టోక్స్‌. జేసన్‌ రాయ్‌ (17), జో రూట్‌ (7), బెయిర్‌స్టో (36), మోర్గాన్‌ (9) నిష్క్రమించగా 86/4తో ప్రమాదంలో ఉన్న స్థితిలో మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ చేజారినట్లే అనిపించింది. కానీ స్టోక్స్‌ అద్భుత పోరాటం, అసాధారణ సంకల్పం, అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆతిథ్యను ఆదుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ, సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతుండగా తీవ్రమవుతున్న ఒత్తిడిని తట్టుకుంటూ అతడు పోరాడాడు.

బట్లర్‌ (59; 60 బంతుల్లో 6×4) అద్భుత సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సింగిల్స్‌ తీసుకుంటూ వీలైనప్పుడు బౌండరీలు కొడుతూ సాగిన ఈ జంట ఐదో వికెట్‌కు 110 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్‌ కోలుకుంది. 44.4 ఓవర్లలో 196/4తో గెలుపుపై కన్నేసింది. సాధించాల్సిన రన్‌రేట్‌ కాస్త ఎక్కువగానే ఉన్నా నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉండడంతో ఇంగ్లాండ్‌ ధీమాతోనే ఉంది.

కానీ వేగాన్ని పెంచే క్రమంలో బట్లర్‌, కాసేపటికే వోక్స్‌ (2) కూడా నిష్క్రమించడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. స్టోక్స్‌కు కాసేపు సహకరించిన ప్లంకెట్‌ (10) 49వ ఓవర్లో జట్టు స్కోరు 220 వద్ద ఔటయ్యాడు. టెయిలెండర్లు చకచకా వెనుదిరుగుతుండగా స్టోక్స్‌ ఉత్కంఠను తట్టుకుంటూ అతికష్టంపై మ్యాచ్‌ను టైగా ముగించాడు. మరోవైపు, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టడి చేశారు. నికోల్స్‌ రాణించినా ఓ దశలో 141/4తో ఉన్న కివీస్‌ను లేథమ్‌ ఆదుకున్నాడు. వోక్స్‌ (3/37), ప్లంకెట్‌ (3/42) న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు.

ఆఖరి ఓవర్లో (బౌల్ట్‌) ఇంగ్లాండ్‌ విజయానికి 15 పరుగులు అవసరంకాగా చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. తొలి రెండు బంతులకు ఒక్క పరుగూ రాకపోవడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. మూడో బంతికి స్టోక్స్‌ సిక్స్‌ కొట్టాడు. నాలుగో బంతికి ఇంగ్లాండ్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. స్టోక్స్‌ రెండు తీశాడు. శక్తినంత కూడదీసుకుని పరుగెత్తిన అతడు రెండో పరుగు ముగించడానికి ముందుకు డైవ్‌ చేయగా త్రో బ్యాటును తాకి బౌండరీకి దాటింది. అంటే నాలుగో బంతికి మొత్తం ఆరు పరుగులొచ్చాయన్నమాట.

ఐదో బంతికి సింగిల్‌ వచ్చింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో రషీద్‌ ఔటైనా స్టోక్స్‌ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. చివరి బంతికి ఇంగ్లాండ్‌ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా రెండో పరుగు తీసే క్రమంలో వుడ్‌ రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ టై అయి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఇలా సాగిన ఉత్కంఠ పోరు బహుశా, విశ్వంలో ఇదొక్కటేనేమో!