విశాఖపట్నంలోని విక్టోరియా ఆసుపత్రిలో గైనకాలజీ వార్డు

అమరావతి, జులై 28: రాష్ట్రంలో ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రుల్లో దోపిడీ దందా మరింత పెరిగింది. సదరు గర్బిణీ ప్రసవ వేదన సమయంలో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసి కొందరు వైద్యులు పెద్ద మొత్తాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని ఆసుపత్రు ల్లోనూ అవసరం లేకపోయినా ఎడా పెడా ఆపరేషన్లు చేస్తున్నారు. ఆయా ఆసుపత్రుల స్థాయిని బట్టి రూ.35వేలు మొదలుకుని గరిష్టంగా రూ.70వేల వరకూ కాన్పు చార్జీలుగా ముక్కుపిండి మరీ రాబడుతున్నారు.

ఆపరేషన్ జరిపినప్పటికీ కొత్త కేసులను చేర్చుకోవడం కోసం కేవలం మూడు రోజుల్లోనే డిశ్చార్ట్ చేసి పేషెంట్లను ఇళ్లకు పంపించి వేస్తున్నారు. ఒకవైపు పచ్చి బాలింత, మరోవైపు పురిటిబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు పడే వేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటే మెరుగైన వైద్య సేవలు అందుతాయనే ఆశతో ప్రైవేటు ఆసుపత్రులల్లో కాన్సులు చేయించేందుకే ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అనేక ఆసుపత్రుల నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కాన్పుకు ముందు వైద్య పరీక్షల కోసం వచ్చిన వారిని తొలుత స్కానింగ్ సహా వివిధ రకాల పరీక్షలు జరిపి డెలివరీ అయ్యే తేదీని చెబుతారు. అలాగే సాధారణంగా డెలివరీ కావచ్చని తొలుత నమ్మబలుకుతారు.

తీరా ఆసుపత్రిలో చేరితే సాధారణ డెలివరీ కావడం కష్టమని, కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందీ, మెడలో ఒకటి కంటే ఎక్కువ పేగులు వేసుకున్నారు, అంటూ రకరకాల సాకులు చెప్పి చివరకు ఆపరేషన్ ఒక్కటే మార్గమని చెబుతారు. ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వ కుండా హడావుడి చేసి తల్లీ, బిడ్డల్లో ఎవరో ఒకరి ప్రాణానికి ప్రమాదం ఉందని భయ పెట్టేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు హడలిపోయి విధిలేని పరిస్థితుల్లో ఆపరే షకు అంగీకరిస్తారు. వెంటనే నిర్దేశించిన మొత్తం నగదును ఆసుపత్రిలోని కౌంటర్లో జమచేయాలని సూచిస్తారు. ఆ మొత్తం కౌంటర్‌లో కట్టే వరకూ కూడా సదరు పేషెంట్ తనకు కేటాయించిన గదిలో ప్రసవ వేదన అనుభవిస్తూ ఉండాల్సిందే. కౌంటర్ సిబ్బంది సంబంధిత డాక్టర్‌కు ఫోన్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంటనే పేషెంట్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించడం వెంట వెంటనే జరిగిపోతుంది.

కాన్పు తర్వాత కేవలం మూడ్రోజుల్లోనే పేషెంట్‌ను డిస్చార్జ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను రెండో కాన్పు కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చామని, మొదటి కాన్పు సాధారణంగా అయినప్పటికీ రెండో కాన్పు కష్టం అవుతుందని భయపెట్టి ఆపరేషన్ చేశారని విజయవాడకు చెందిన కుటుంబం వాపోయింది. సాధారణ డెలివరీ అయితే రూ.35వేలు, అదే ఆపరేషన్ చేసినట్లయితే రూ.50 వేలు అవుతుందని వైద్యులు తొలుత చెప్పారని తెలిపారు. అయితే చివరకు ఆపరే షన్ చేసి రూ. 50 వేలతోపాటు కరోనా వైద్యం పేరుతో అదనంగా మరో రూ. 5వేలు వసూలు చేశారని పేర్కొన్నారు. అలాగే తమ బంధువుల అమ్మాయి ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే రెండు పేగులు మెడలో వేసుకోవడం వల్ల కాన్పు కష్టమవుతుందని భయపెట్టి ఆపరేషన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా తప్పని కడుపుకోత ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణీలను ముందస్తుగా స్కానింగ్ చేసి కడుపులో బిడ్డ స్థితిగతులను వైద్యులు పరిశీలించడం పరిపాటి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చాలా చోట్ల కాన్పు సమయంలో మరణించిన శిశువులు భూమ్మిదపడుతున్నారు. కాన్పునకు కొద్ది రోజుల ముందు తీసిన స్కానింగ్‌లో కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నదని చెప్పారని, తీరా డెలివరీ అయ్యాక మృతశిశువు పుట్టారని చెప్పడం తమను ఎంతగానో కలచివేసిందని విజయవాడ పాతబస్తీకి చెందిన కుటుంబం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here