ముంబయి, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): మ‌హారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాజీనామా లేఖను సమర్పించారు. అనిల్ దేశ్‌ ముఖ్ రాజీనామాను సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆమోదించాల్సి ఉంది. కాగా, రాజీనామాకు ముందు శరద్ పవార్‌ను అనిల్ దేశ్‌ముఖ్ కలిశారు. ఆయనతో భేటీ అనంతరం సీఎంను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. రూ. 100 కోట్లు వసూళ్లకు పాల్పడినట్లు దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే వసూళ్ల పర్వంపై ప్రాథమిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు నిర్ణయించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారంటూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మార్చి 31న బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరమ్ బీర్ సింగ్ తరఫు న్యాయవాది విక్రమ్ నంకని హాజరై వాదనలు వినిపించారు. ఈ కేసులో మరో మూడు పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి. వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జి.ఎస్. ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఇదిలాఉంటే హోంమంత్రిపై తాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఫిర్యాదు చేసిన కార‌ణంగానే త‌న‌ను బ‌దిలీ చేశార‌ని ప‌ర‌మ్ బీర్ సింగ్ ఆరోపించారు. పోలీసు అధికారుల‌కు నెల‌కు రూ.100 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యం విధించార‌ని, అక్రమ బదిలీలు చేశార‌ని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ప‌రంబిర్ ఆరోప‌ణ‌లు గుప్పించారు.