విలువల వారసత్వాన్ని కొనసాగించండి

64
సీపీ గుర్నానీని సత్కరిస్తున్న ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌ పేరి శ్రీనివాసరావు, మాజీ డీజీపీ ఎన్. సాంబశివరావు
  • పూర్వవిద్యార్థులు వారధులు కావాలి… ఆపూస చారిత్రాత్మకం

  • ఏయూ పర్యటనలో టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ

విశాఖపట్నం, డిసెంబర్ 13 (న్యూస్‌టైమ్): విలువలను వారసత్వంగా అందించడం ఎంతో ప్రధానమని టెక్‌ మహేంద్ర సిఈఓ సి.పి గుర్నానీ అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పూర్వవిద్యార్థులను, ఆచార్యులను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మూలాలను మరువద్దని, జీవితం ఎల్లవేళలా ఆసక్తిదాయకంగా నిలుస్తుందన్నారు. విలువలు సర్వజనీయమైనవని, వీటిలో ఎటువంటి మార్పులు ఉండవన్నారు.

నేటి తరం తల్లిదండ్రుల బలం, బలహీనత వారి పిల్లలేనన్నారు. పరిశ్రమకు, విశ్వవిద్యాలయానికి మధ్య వారధులుగా పూర్వవిద్యార్థులు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వర్సిటీలోని 64 విభాగాలను కలుపుతూ ఏర్పడిన పూర్వవిద్యార్థుల సంఘం నిర్వహణ చారిత్రాత్మకమన్నారు.

మాజీ డీజీపీ ఎన్‌.సాంబశివ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడూ నిరుత్సాహం చెందవద్దన్నారు. విజయం ఆలస్యం అవుతుందని, తప్పకుండా లభిస్తుందన్నారు. తాను ఏయూ ఇజంనీరింగ్‌ కళాశాల విద్యార్థిని కావడం తనకు గర్వకారణమన్నారు. తాము చదువుకున్న రోజులకు, నేటికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. పరిస్థితులు, ఆర్ధిక వ్యవస్థ, పరిశ్రమల్లో ఎంతో మార్పు, అభివృద్ధి సాధ్యపడిందన్నారు.

ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న నిపుణులను ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల అందించిందన్నారు. పూర్వవిద్యార్థులు విభిన్న రూపాలలో ఏయూకు సహకారం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆపూస చైర్మన్‌ బీల సత్యనారాయణ, మాజీ వీసీలు జి.ఎస్‌.ఎన్‌ రాజు, అల్లం అప్పారావు, కె.రాంజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్నానీని సత్కరించారు.