విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు

3406

విశాఖపట్నం, అక్టోబర్ 3 (న్యూస్‌టైమ్): విశాఖ మన్యంలో విస్తారంగా సాగవుతున్న గంజాయి మొక్కలు ధ్వంసం చేసేందుకు ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌, జిల్లా రూరల్‌ ఎస్పీ ఆదేశాల మేరకు ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో రెండో విడత దాడులు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు.

మన్యంలో ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతోసహా దాడులకు శ్రీకారం చుట్టారు. మన్యంలో కొనసాగుతున్న దాడుల్లో భాగంగా రెండో రోజు జి.మాడుగుల పెద్దరాయి, వంతనపల్లి గ్రామాలకు అబ్కారి శాఖ, సివిల్‌ పోలీసులు, అటవీశాఖ, రెవెన్యూ శాఖల నుంచి మొత్తం 220 మంది అధికారులు, కూలీలతో రెండు బృందాలుగా ఏర్పడి గ్రామాలకు చేరుకున్నారు. ఆ గ్రామ పరిసరాల వద్ద విస్తారంగా సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో మొత్తం 14.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.63,900 విలువైన 500 గంజాయి మొక్కలను ధ్వంసం చేశామని డీసీ తెలిపారు.

అనంతరం పెద్దరాయి గ్రామస్థులతో మాట్లాడి ఇప్పటినుంచి గంజాయి సాగు చేయకుండా ఆ భూముల్లో అటవీ ఉత్పత్తులు పండించుకోవాలని సూచించారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్టు తెలిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఒక్కో గంజాయి మొక్క రెండు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరిగి ఉన్నాయన్నారు. గంజాయి సాగు చేస్తున్న ప్రదేశాలను డ్రోన్‌ కెమెరాల సాయంతో గుర్తించి తోటలను ధ్వంసం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మన్యంలోని 11 మండలాల్లో అనంతగిరి, కొయ్యూరు మినహా తొమ్మిది మండలాల్లో 151 గ్రామాలు గంజాయి సాగు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. వీటిలో దశలవారీగా దాడులు చేపడతామని పేర్కొన్నారు.

ఈ దాడులు పైలట్‌ ప్రాజెక్టు కింద చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో అబ్కారీ శాఖ నుంచి ఏఈఎస్‌లు, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు జిల్లాల నుంచి అబ్కారీ శాఖ పోలీసు సిబ్బందితోపాటు 100 మంది కూలీలు పాల్గొన్నారు. మరోవైపు, కారులో రవాణా చేస్తున్న 72 కిలోల గంజాయిని గొల్లప్రోలు పోలీసులు స్వాధీనం చేసుకుని వాహన చోడకుడ్ని అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు బైపాస్‌ రోడ్డులోని ప్రత్తిపాడు కూడలి వద్ద గంజాయి రవాణా చేస్తున్న కారును గుర్తించారు.

పోలీసులకు ముందుగా అందిన సమాచారం మేరకు ప్రత్తిపాడు రోడ్డు కూడలిలో మాటు వేసి కారును అడ్డుకున్నారు. వెనుక డిక్కీలో ఉన్న గంజాయిని తహసీల్దారు వై.జయ, వీఆర్వోల సమక్షంలో స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు నుంచి కాకినాడ సమీపంలోని సర్పవరానికి గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలేనికి చెందిన డ్రైవరు కామిరెడ్డి రాంబాబును అరెస్టు చేశామని, అతన్ని పిఠాపురం న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు.