ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం జయంతి

82

విజయవాడ, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): ‘భారతరత్న’ మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి వేడుకలు నగగరంలోని ‘ఎ ప్లస్ కన్వెన్షన్‌’లో సోమవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్నే జాతీయ విద్యా దినోత్సవంగా కూడా జరుపుతూ వస్తుండడంతో దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కార అవార్డుల ప్రదానోత్సవాన్ని కూడా ఏర్పాటుచేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మచిలీపట్నం ఎం.పి. వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, రక్షణ నిధి, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలతోనే సాధ్యమని అన్నారు. పేదరికం నుంచి బయటపడాలి అంటే చదువు చాలా ముఖ్యమని, తమ ప్రభుత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. అబుల్‌ కలాం జయంతిని 2008లో మైనార్టీ వెల్ఫేర్ డేగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసం అబుల్‌ కలాం ఆజాద్‌ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.

1947 నుంచి 1958 వరకు మౌలానా విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలు అందిచారని కొనియాడారు. అనేక విద్యా సంస్థలను పునాది వేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో పేదరికంను, వెనుకబాటును అతి దగ్గరగా చూశానని అన్నారు. దీనంతటికీ కారణం పిల్లలకు నాణ్యమైన విద్యలేకపోవడమే పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతం ఉన్నట్లు తెలుస్తోందని, దేశంలో 27 శాతం ఉందని, దేశ సరాసరి కంటే చాలా వెనుకబడి ఉన్నామన్నారు. ఈ దారిద్యం పోవాలి అంటే పిల్లలకి ఉన్నత విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక దీపం గదికి వెలుగునిస్తే చదువుల దీపం కుటుంబానికి, దేశానికి వెలుగునిస్తుందని చెప్పారు. ‘‘ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలి. అది ఒక్క ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలతోనే సాధ్యం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇటీవల ఓ జీవోను విడుదల కూడా చేసింది. కార్యాచరణ కూడా రూపొందించింది. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్‌కల్యాన్‌ వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారు. పేదవాడికి ఇంగ్లీషు మీడియం ఎందుకని చులకన చేశారు. ఈ సందర్భంగా వారందరికి నేను సవాలు విసురుతున్నా చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు? పవన్‌ కల్యాన్‌ కుమారులు ఏ మీడియంలో చదువుతున్నారు? పిల్లల్ని మంచి చదవులు ఇ‍వ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. పిల్లలకి ఉన్నత చదవులు అందించాలని అనే సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దానిపై ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం నిజంగా దారుణం’’ అని వ్యాఖ్యానించారు.

‘‘మన పిల్లలకు చదువు చెప్పకపోతే దేశం నష్టపోతుంది. ప్రతి చదువు కోసం ఏ పేదింటిలో కూడా అప్పులపాలు రాకుండా ఉండాలి. ఆ దిశగా అడుగులు వేస్తునే డిసెంబర్‌ నెలాఖరులో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నవంబరు 14న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం మార్పు కోసం శ్రీకారం చుడుతున్నాం. నేడు స్కూళ్లు ఎలా ఉన్నాయని చూపిస్తాం. ప్రతి స్కూల్‌లోనూ బాత్‌రూం, నీళ్లు, బ్లాక్‌బోర్డు, పర్నీచర్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఉండాలి. ప్రతి స్కూల్‌కు పెయింటింగ్‌ ఉండాలి. రేపు సంవత్సరం మొదలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియం చేస్తూ, తెలుగు, ఉర్దూ బాషను తప్పని సరి చేస్తాం. మీడియం మాత్రం ఇంగ్లీష్‌ చేస్తాం. 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం. తరువాత సంవత్సరం 7, ఆ తరువాత 8, 9, 10 ఇలా ఏటేటా ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం’’ అని సీఎం చెప్పారు.

‘‘డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఇక్కడికి వచ్చే ముందు మదర్సాల గురించి ఆలోచించాలని కోరారు. ఇందుకోసం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అక్కడి పిల్లలకు కూడా మోడ్రన్‌ ఎడ్యుకేషన్‌ తీసుకురావాలి. ఉర్దూ, ఖురాన్‌లో రాణిస్తునే మరోవైపు ఇంగ్లీష్‌ చదువులు చదివేలా రెండు బ్యాలెన్స్‌ చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని వాళ్ల వద్దకు కూడా తీసుకువెళ్తాం’’ అని అన్నారు.

‘‘గతంలో పెళ్లి కానుక చంద్రబాబు పెట్టారు. ఈ పథకం ఆగిపోయింది. నవంబర్‌ 2018 నుంచి ఈ పథకం తెరమరుగు అయ్యింది. చంద్రబాబు పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కొంచెం టైం ఇస్తే మార్చిలో వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక తీసుకువస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన దానికంటే వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక రెట్టింపు చేస్తూ రూ.1 లక్ష ఇస్తాం. మౌజమ్‌, మౌలానాలకు గౌరవవేతనాలు పెంచి ఇస్తాం. దీనికి కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను. మసీదుల సంఖ్య పెంచుతాం. ఇస్తామన్న రూ.15 వేలు ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా’’ అని అన్నారు.

ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా మాట్లాడుతూ ‘‘దేశ స్వాతంత్ర్యం, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన వారికి జోహార్లు. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా సంవత్సరం నిర్వహిస్తున్నాం. అటువంటి వారి జయంతి రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి స్మరించుకోవడం మన ధర్మం. విద్యా రంగంలో పటిష్టమైన పునాదులను అరవై యేళ్ల క్రితం అబుల్ కలాం వేశారు’’ అని అన్నారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన నాడే అభివృద్ధి సాధ్యమని, నేటి పోటీ ప్రపంచంలో విద్యా రంగాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలానా కృషి వల్లే మన దేశ విద్యా విధానంపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపాయని, పేదరికం నిర్మూలన కోసం విద్యను అందరికీ అందించాలని మౌలానా ఆనాడే సూచించారన్నారు.

‘‘అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువే. ఆయన భావాలు, ఆలోచనలు ప్రపంచ మేధావులను అబ్బురపరిచాయి. ఆయన పేరుతో విద్యా పురస్కార అవార్డులను అందిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తుంది. మైనారిటీ విద్యార్థులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇమామ్, మౌజీలకు పది వేలు, ఐదు వేలకు సీఎం జగన్ పెంచారు’’ అని వెల్లడించారు.

‘‘దేశంలోనే తొలిసారిగా హజ్ యాత్రికలకు పూర్తి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. జెరూసలెం యాత్రికులకు కూడా ఆదాయాన్ని బట్టి అరవై, ముప్పై వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. చర్చి ఫాదర్లకు నెలకు ఐదు‌వేలు ఇస్తున్నాం. ఏపీ అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేలా జగన్ కృషి చేస్తున్నారు’’ అని తెలిపారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ‘‘విద్యాశాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. విద్యాభివృద్ధితోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్పూర్తితో సీఎం జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు. మైనారిటీలకు మంచి విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వైఎస్‌ జగన్ అంజాద్ భాషాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గుర్తించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్దులకు ప్రోత్సాహం అందించాలని జగన్ నిర్ణయించారు. వైఎస్ ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చి పేదలకు ఉన్నత విద్యను దగ్గర చేశారు. సీఎం జగన్ కూడా దళితులు, మైనారిటీలకు మెరుగైన విద్యను అందించేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు’’ అని చెప్పారు.

‘‘ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధి నిదర్శనం. దీనిపై కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారు. వైఎస్‌ జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయి. నారా వారు కూడా మాట్లాడతారు.. మనం చూశాం.. బ్రీఫ్ డ్ మీ అని. కమిషన్ల కోసం వందల, వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది’’ అని విమర్శించారు.

విద్యా శాఖ, మైనార్టీ సంక్షేమ వ్యవహారాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ల్స్‌ను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా వేదిక ప్రాంగణంలో వివిధ మతాధిపతులు సర్వమత ప్రార్థనలు చేశారు.