కరోనా వ్యాప్తిపై మంత్రి బాలినేని సమీక్ష

0
12 వీక్షకులు
జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్‌తో కలిసి కరోనా తాజా పరిస్థితులను సమీక్షిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు, ఏప్రిల్ 18 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తి, నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా కేసుల నమోదు, అనుమానితులకు అందిస్తున్న చికిత్స విధానాన్ని కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు.

అనుమానితులందరికీ కరోనా పరీక్షలు చేయించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. అనంతరం ఆయన కలెక్టర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తనకు కరోనా వ్యాపించిందని తప్పుడు ప్రచారం చేశారని బాలినేని వాపోయారు. ‘‘పది, పదిహేను రోజుల క్రితం వరకు నేను ఒంగోలులోనే ఉన్నా. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో పాల్గొన్నా. నేను ఇక్కడే ఉండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటే రద్దీ ఎక్కువవుతోంది. అందుకని హైదరాబాద్‌ వెళ్లా. దాన్ని కూడా తెదేపా, జనసేన నాయకులు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. నాకు కరోనా సోకిందని దుష్ప్రచారం చేస్తున్నారు. నాకూ భార్యా పిల్లలు ఉన్నారు. కరోనా సోకితే నేను వారితో ఎందుకు కలిసి ఉంటాను. నా మంచితనానికీ, ఓర్పునకు కూడా ఓ హద్దు ఉంటుంది. హద్దు మీరి ప్రవరిస్తే సహించేది లేదు’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాను హైదరాబాద్‌లో ఉన్నా రోజూ జిల్లా, నగరపాలక సంస్థ అధికారులతో పాటు తమ పార్టీ నాయకులతో మాట్లాడుతూ సహాయ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని తెదేపా, జనసేన నాయకులను డిమాండ్‌ చేశారు. ఒంగోలులో తమ పార్టీ నాయకుడు ఒకరికి కరోనా వచ్చిన మాట వాస్తవమేనని, అతను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తనను కలవలేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తే సహించేది లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రచార ఆర్భాటం తప్ప మరేమీ లేదని అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను పంపిణీ చేస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

మరోవైపు, జిల్లాలో కరోనా విస్తరణను అరికట్టేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ పోలా భాస్కర్ మంత్రికి వివరించారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా వాసులు ఇద్దరు కరోనా సోకి నెల్లూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఒంగోలు గోపాల్‌నగర్‌కు చెందిన వ్యక్తి నెల్లూరులోని బంధువుల ఇంటికి వెళ్లాక అనారోగ్యానికి గురయ్యారని, అక్కడ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని, దాంతో అక్కడే ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

తాజాగా కొరిశపాడు మండలం రావినూతలకు చెందిన 75 ఏళ్ల వయసున్న వ్యక్తికి కరోనా సోకిందని, ఇతడు తన కుమారుడు నెల్లూరులో ఉండటంతో ఈ నెల 12న అక్కడికి వెళ్లారని, వ్యాధి లక్షణాలు ఉండటంతో నారాయణ ఆసుపత్రిలో చేరగా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఆయన కూడా అక్కడే ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని భాస్కర్ పేర్కొన్నారు. కొరిశపాడుకు చెందిన వ్యక్తికి సంబంధించి 35 ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ వ్యక్తులను అధికారులు గుర్తించామని, గ్రామంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కరోనా నిర్ధరణ పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా, వేగంగా చేపట్టేందుకు స్థానికంగా ఏర్పాట్లు చేశామన్నారు. జీజీహెచ్‌తో పాటు అన్ని ఏరియా ఆసుపత్రుల్లో శనివారం నుంచి ట్రూనాట్‌ పద్ధతిలో పరీక్షలు చేస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here