హైదరాబాద్, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్ బాల్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ జట్టు ఢిల్లీ జట్టుపై 11-6 పాయింట్‌లతో విజయం సాధించి జాతీయ ఛాంపియన్ షిప్‌ను సాధించిన సందర్భంగా తెలంగాణ బేస్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేతృత్వంలో వచ్చిన క్రీడాకారులను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తన కార్యాలయంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను, కోచ్‌లను, అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్రంలో క్రీడా పాలసీని ప్రవేశపెట్టబోతున్నామన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సాహిస్థూన్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్, బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, ట్రెజరర్ కృష్ణ, కోచ్‌లు శ్రీకాంత్ మోగిలి, కృష్ణ, సాయికుమార్, మేనేజర్ రాహుల్, క్రీడాకారులు, క్రీడాకారిణిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.