స్వీయ దిగ్బంధంలోకి మంత్రి కిషన్ రెడ్డి?

0
9 వీక్షకులు
జి. కిషన్‌రెడ్డి (File photo)

న్యూఢిల్లీ, మే 2 (న్యూస్‌టైమ్): దేశరాజధాని ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు శాటిలైట్ ఛానల్ ‘10 టీవీ’ రిపోర్టర్ గోపికృష్ణకు కరోనా వైరస్ వ్యాపించింది. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఉచితంగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరితో పాటు గోపికృష్ణ కూడా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, గోపికృష్ణకు షుగర్ సమస్య కూడా ఉందని డాక్టర్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న గోపికృష్ణ విధి నిర్వహణలో భాగంగా అంతకముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని మూడుసార్లు ఇంటర్వ్యూ చేశారు.

గోపీకృష్ణకు కరోనా లక్షణాలు వెలుగుచూడడంతో మంత్రి కిషన్‌రెడ్డి స్వీయ నియంత్రణలోకి వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, గోపీకృష్ణ ఎవరెవరిని కలిసాడనే కోణంలో వైద్యులు, పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. గోపికృష్ణ కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ఫలితం ఇంకా రావాల్సి ఉంది. కాగా, ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధుల్లో మరి కొందరికి ఆదివారం కరోనా పరీక్షలు చేయనున్నారు.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలోని జర్నలిస్టులను‌‌ కూడా కరోనా తాకింది. నగరంలో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా లక్షణాలు కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మమారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు జర్నలిస్టులకు కరోనా వ్యాపించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో మీడియా ప్రతినిధులకు కరోనా లక్షణాలు వెలుగుచూసిన తర్వాత చాలా రాష్ట్రాలు మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు జరిపించాలని నిర్ణయించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here