నూతన విద్యా విధానాన్ని గురించి మీడియా సమావేశంలో వెల్లడిస్తున్న హెచ్‌ఆర్‌డీ మంత్రి నిశాంక్

కొత్త విద్యా విధానం మార్గదర్శకం మాత్రమేనా?

కరోనా నేపథ్యంలో విదేశీయ కోట్ల కోసం ఎదురు చూసే స్థితి

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

భారతదేశంలో 34 సంవత్సరాల తరువాత విద్యా విధానంలో కీలక మార్పులు చేస్తూ కేంద్ర నిర్ణయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూతన విద్యా విధానంలో తెలియజేసిన అశయాలు, ఉద్దేశ్యాలు బాగున్నాయి. ఆ దిశగా అమలు చేస్తారా? అమలు చేయాలంటే నిధులు కేటాయిస్తారా? అనే అనుమానాలున్నాయి. దేశాన్ని కరోనా ఆరోగ్య సంక్షోభం గడగడలాడిస్తుంటే ఇప్పటివరకు విదేశాల పీపీఈ కిట్లు కోసం ఎదురు చూడడం మన పాలకుల పరిశోధనలు, నూతన ఆవిష్కరణల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం నూతన విద్యా విధానంలో చూపుతున్న చొరవ దాని అమలులో శ్రద్ధ తీసుకోవాలి.

ఇదే సందర్భంలో విద్య తరువాత ఉపాధికి అవకాశాలుండే పారిశ్రామిక విధానాన్ని కూడా లింక్ చేయాల్సిన అవసరముంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నూతన విద్యా స్ఫూర్తి అమలు జరిగేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు విద్యను ప్రోత్సహించడంతోపాటు ఆ విద్య ద్వారా దేశాభివృద్ధి, దేశం జీడీపీ ఆధారపడి వుంటుంది. భారతదేశం స్వతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా వ్యవసాయ ఆధారిత దేశంగానే చెప్పబడుతోంది. పరిశోధనల పట్ల సాంకేతిక విద్య పట్ల భారతదేశంపై పూర్తి నమ్మకం, విశ్వాసం, నూతన పాలసీ ద్వారా ఊతమిస్తుందో లేదో చూడాలి. కాగితాల్లో నూతన విద్యా విధానం ఉపయుక్తంగా కనబడుతోంది. కేంద్రం అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ప్రపంచ దేశాలకు దీటుగా విదేశీయ విద్యకు వెళ్లే విద్యార్థులను ఆకర్షించేలా తద్వారా ఉన్నత విద్య వచ్చే ఫలాలను మన దేశానికి ఉపయోగపడేలా కార్యాచరణ అవసరం. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు కోసం విదేశాల వైపు ఎదురు చూసే పరిస్థితి వుంది.

మన దేశంలో కరోనాలో ప్రాణం కాపాడే పరికరాల కోసం ఆ దిశగా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం మనకు పెద్ద గుణపాఠం కావాలి. ఇప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీడీపీలో తమ వాటాగా 4.4 శాతమే కేటాయిస్తుండడం గమనార్హం. భారతదేశంలో దాదాపు 1000 యూనివర్సిటీలు వీటితోపాటు 40 వేల కాలేజీలు, 14 లక్షల అధ్యాపక బృందం దాదాపు 3.75 కోట్ల విద్యార్థులు ఉన్నత విద్యలో వున్నారు. ఈ నూతన విద్యా విధానంలో అంతర్జాతీయ పెట్టుబడి దేశాల మోజులో భారతదేశంలో నూతన విద్యా విధానం అమలు కావాలంటే భారీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది స్పష్టత లేదు. చివరకి ప్రైవేటు విద్యా సంస్థలను పెంచిపోషించడానికి ఉపయోగపడుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతుందనేది పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన నూతన విద్యా విధానాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. ఇది శుభ సూచికమని తెలుపుతున్నారు. జాతీయ విద్యా విధానం అనేది మార్గదర్శక సూత్రాలతో కూడిన సిఫార్సులు మాత్రమే. వీటిని ప్రతి రాష్ట్రంలో అమలు చేయడానికి అక్కడ వున్న భౌగోళిక, సామాజిక పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. రాష్ట్రాల అవసరాలు, ఆర్థిక స్తోమత, వారి ఆంక్షల ప్రాధాన్యత ప్రకారమే అమలు చేసే పరిస్థితి వుంది. విద్య అనేది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో అంశం.

నూతన విద్యా విధానం అమలు కావాలంటే రాష్ట్రాల తోడ్పాటు కూడా అవసరం తప్పనిసరి. బలవంతంగా నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి లేదు. ఇటీవల ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మీడియం కూడా పెట్టాలని రాష్ట్రంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల హక్కులకు భంగం కలిగించలేమని స్పష్టం చేసింది. కొత్త విద్యా విధానం సాధ్యా సాధ్యాల మీద ఆధారపడి వుంటుంది. ఇది దిశ, నిర్దేశం కాదు. దిశ, నిర్దేశానికి కావాల్సిన మార్గదర్శకాలు మాత్రమే. ప్రాథమిక విద్యా విధానంలో మాతృభాషలోనే జరపాలన్న నూతన విద్యా విధానం పాలసీని కేంద్రం ఆమోదించిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే ప్రభుత్వం ఒకటో తరగతి నుంచే తెలుగులో కాకుండా ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన ప్రవేశపెట్టాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. విద్యా రంగ నిపుణులు, తెలుగు భాషాభిమానులు, ప్రజా సంఘాలు వ్యతిరేకించినా చివరకు హైకోర్టు ఈ ప్రతిపాదనలు కొట్టివేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాథమిక దశలో ఆంగ్లంను అమలు చేయాలన్న పట్టుదలతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేంద్రం నూతన విద్యా విధానంలో ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో జరగాలన్న సిఫార్సులు కత్తి మీద సామైంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా పెరుగుదలకు తగ్గట్టు విద్యకు ఏడాదికేడాది చదువుకునే వారి సంఖ్య పెరిగినా కేటాయింపులు మాత్రం ప్రతిఏటా తగ్గుతూనే వస్తోంది. అనేక సంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆచరణలో పేదవారికి ఉపయోగపడే సంస్కరణలు ఇప్పటివరకు జరగలేదు. ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం పరోక్షంగా విదేశీయ విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ వేసినట్లవుతోంది. స్వదేశీయ ప్రైవేటు విద్యా సంస్థలకు ఊతమిచ్చినట్లవుతోంది. నూతన విద్యా విధానం శతశాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తగిన నిధులు కేటాయించి నిర్ణీత కాలంలో అమలు చేయగలిగితే నూతన విద్యా ఫలాలు అందరికీ అందుతాయి.

లేనిపక్షంలో తూతూ మంత్రంగా నూతన విద్యా విధానం అమలైతే పేదలకు, మధ్య తరగతి వర్గాలకు విద్య అందని ద్రాక్షలా తయారవుతుంది. ప్రభుత్వం పేదలకు విద్యను ప్రోత్సహించేందుకు అనేక పథకాలతో నిధులిస్తారు. కానీ విద్యను నేర్చుకోడానికి ప్రభుత్వ సంస్థలుండవు. ప్రైవేటు సంస్థల మీద ఆధారపడాలి. ప్రైవేటు సంస్థలు లాభాపేక్షతో నాణ్యమైన విద్యను మెజార్టీ సంస్థలు అందించవు. కేవలం పేదలకు విద్య పేరుతో ఇచ్చే నిధులను సొంతం చేసుకునేందుకే ప్రైవేటు విద్యా సంస్థలు ముందు వరుసలో వుంటాయి.

నూతన విద్యా విధానాన్ని గతంలో వ్యతిరేకించిన బీజేపీ

ఆచార్య కేఎస్ చలం

‘‘నూతన విద్యా విధానం ఎవరికోసం? ఎందుకోసం అనే అనుమానాలు నివృత్తి కావడం లేదు. నూతన విద్యా విధానంలో అనేక మార్పులను తీసుకువచ్చేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తే వ్యతిరేకించిన వారిలో నేటి బీజేపీ వుంది. ఈ రోజు పేదలకు విద్యను దూరం చేసేలా డబ్బున్న వారికే ఉన్నత విద్యను ముఖ్యంగా ప్రైవేటు రంగానికి ధారదత్తం చేసేలా ఈ బిల్లు కనిపిస్తోంది. ఇప్పటికే భారతదేశం నుంచి తొమ్మిది లక్షల మంది ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుతున్నారు. నూతన విద్యా బిల్లు బలహీన వర్గాలకు ఈ దేశానికి పెద్దగా ఉపయోగపడదు. దేశంలో పరిశోధనలు అంతర్జాతీయ పేపర్లు, కొత్త ఆవిష్కరణలు జరగడం లేదు. ఆ దిశగా నిధులు కేటాయింపు లేదు. ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నా వాటి మీద నియంత్రణ కొరవడింది. నాణ్యతా ప్రమాణాలు కొన్నిట్లో మినహా అత్యధిక శాతం ప్రజల సొమ్మును సొమ్ము చేసుకోడానికే ఉన్నాయి. ఇది ప్రపంచ బ్యాంకుకు అనుకూలంగా తెచ్చిన బిల్లు. సంపర్ణ వర్గాలకు ప్రైవేటు కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు ఉపయుక్తం’’ అని యూపీఎస్‌సీ పూర్వ సభ్యుడు, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య కేఎస్ చలం పేర్కొన్నారు.

ఆచార్య బీలా సత్యనారాయణ

‘‘నూతన విద్యా విధానం అమలు జరిగితే చాలా మంచిది. గతంలో విద్యా హక్కు చట్టం తెచ్చారు. ఇది కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఏ దేశమైనా ప్రగతి బాట పట్టాలంటే ఆ దేశంలో విద్య ప్రాధాన్యత వుండాలి. ప్రైవేటు రంగంలో విద్య పట్ల అంకితభావం కొరవడింది. గతంలో ఉన్నత విద్యలో గురువుల పట్ల ఉన్న స్ఫూర్తి క్రమంగా తగ్గిపోతోంది. పరిశోధనలకు నిధులు అంతంతమాత్రంగా వున్నాయి. కొత్త ఆవిష్కరణలు ముఖ్యంగా సమాజానికి పనికొచ్చే పరిశోధనలు అవసరం. కేవలం డిగ్రీ కోసం పరిశోధనలతో ప్రయోజనం వుండదు. నూతన విద్యా విధానంలో ఆ దిశగా నిధులు కేటాయించి అందరికీ విద్య అందేలా చూడాలి.’’ ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ తెలిపారు.

ఆచార్య వై. సత్యనారాయణ

‘‘నూతన విద్యా విధానం స్వాగతించదగ్గది. ఉన్నత విద్య, సాంకేతిక విద్య అన్నింటినీ ఓ గొడుగు కిందకు తీసుకురావడం శుభ పరిణామం. ప్రాథమిక విద్యలో మాతృభాషను ప్రోత్సహించాలి. విద్య పట్ల మరింత నమ్మకం, గౌరవం పెరగాల్సి వుంది. నూతన విద్యా విధానంతో జవాబుదారీతనం, పారదర్శకత పెరగాలి. నూతన విద్యా విధానంలో న్యాయ విద్యా వ్యవస్థను మెడికల్ విద్యా వ్యవస్థను స్వతంత్ర వ్యవస్థలుగా వుంచడం మంచి ఫలితాలను ఇస్తాయి.’’ దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉప కులపతి ఆచార్య వై.సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

‘‘నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యలో తీసుకువచ్చిన సంస్కరణలు స్వాగతించదగినది. ప్రాథమిక విద్య నుంచి సమూలంగా మార్పులు చేస్తూ సంస్కరణలు తేవడం రాబోయే 15 సంవత్సరాల తరువాత మంచి ఫలాలను చూడవచ్చు. ప్రభుత్వాలు మారినప్పుడు లోపాలు సరిదిద్దడమో చిన్న చిన్న సవరణలు చేయాలో తప్ప అధికారంలో పార్టీలు మారినప్పుడు విధానాలను కొనసాగించకుండా రద్దు చేసి కొత్త విధానాలు ప్రవేశపెడితే విద్యా వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. ఏ స్థాయిలో అయినా విద్య మానవ మనుగడకు ఉపయోగపడాలి. విద్య పట్ల భారతదేశంలో ఎంతోమంది ఆసక్తితో వున్నారు. 34 సం.ల తరువాత ఈ సమూలమైన మార్పులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆచరణాత్మకం అయితే ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. ఇప్పటివరకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మన దేశం వెనుకబడే వుంది. భారతదేశం కేవలం డిగ్రీలు ఇస్తుందనే వాదన వుంది. చైనా దేశం డిగ్రీలతో పాటు నైపుణ్యాన్ని ఇస్తుందనే వాదన, అమెరికా దేశం విద్య, నైపుణ్యం, సృజనాత్మక ఆవిష్కరణలకు అవకాశం ఇస్తుందనే వాదనలకు నూతన విద్యా విధానంతో వాటికి ధీటైన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడింది.’’ అని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విశ్రాంత హెచ్ఓడీ ఆచార్య కె. చంద్రమౌళి పేర్కొన్నారు.

ఆచార్య బాలమోహన్ దాస్

‘‘కేంద్రం నూతన విద్యా విధానం స్వాగతించదగ్గది. ఆ దిశగా అరుశాతం నిధులు కేటాయించడంలో స్పష్టత లేదు. యూనివర్సిటీలను స్వతంత్ర వ్యవస్థలుగా అనుమతించాలి. రాజకీయ ప్రమేయం తగ్గించాల్సిన అంశంలో కచ్చితమైన హామీ కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య, హైస్కూల్ విద్య అన్ని రాష్ట్రాల్లో నూతన విద్యా విధానానికి తగ్గట్టు నిధుల కేటాయింపు, సంస్కరణలు జరగాల్సి వుంది. ప్రభుత్వ రంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ప్రోత్సహించాలి. 1986లో విద్యా విధానం చట్టం వచ్చింది. గతంలో అనేక కమిటీలు ఇచ్చిన నివేదికలు అటకెక్కాయి. 34 సం.ల తరువాత కస్తూరి రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు నేడు నూతన విద్యా విధానం రావడం జరిగింది. ఉపాధ్యాయులను తయారు చేసే బీఈడీ కళాశాలల సమర్ధత పెంచాలి. ఇందులో ఫిలాండ్ దేశంలో ఏడు సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ మనకు ఆదర్శం కావాలి. డిగ్రీ స్థాయి విద్యాభ్యాసంలోపు న్యాయ వ్యవస్థ, పాలకుల విధానాల రూపకల్పన, రక్షణ, ప్రాథమిక వైద్యం, అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర సేవలమీద అవగాహన వుండాలి. ప్రభుత్వ రంగంలో అన్ని విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ప్రాథమిక వసతులను కల్పించి నాణ్యమైన విద్యను అన్ని స్థాయిల్లో అందించడానికి స్పష్టమైన హామీ వుండాలి.’’ అని నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య వి.బాలమోహన్ దాస్ తెలిపారు.

ఆచార్య జీఎస్ఎన్ రాజు

‘‘నూతన విద్యా విధానంలో ఆరు సం.ల వరకు ఆటపాటలతో విద్య నేర్చుకునే ప్రతిపాదన మంచిది. నైపుణ్య విద్యను ఆరో తరగతి నుంచి అమలు చేయడం కూడా ఎంతో ఉ పయుక్తం. ఉన్నత విద్యలో యూజీసీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ (అలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), ఎడ్యుకేషన్ కౌన్సిల్ వీటన్నింటిని విలీనం చేసి ఒకే నియంత్రణ వ్యవస్థలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పెట్టడం ఎంతో ఉపయోగం. చదువును మధ్యలో ఆపేసినా మళ్లీ కొనసాగించుకునే అవకాశం, ఒకవేళ ఉపాధికి వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో ఉపయుక్తంగా విద్యార్థులపై భారం తగ్గించేలా సిలబస్‌లో తగ్గింపుతో ప్రయోగాల విద్యను ప్రోత్సహించడం హర్షించదగ్గది. ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న
ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు నూతన విద్యా విధానం మంచి ఊతమిస్తుంది. దేశంలో విద్య కోసం ప్రభుత్వ కేటాయింపులు అంతంతమాత్రంగా వున్న సందర్భంలో ప్రభుత్వం ప్రైవేటు విద్యను ప్రోత్సహించడం ఎంత అవసరమో ఇదే సందర్భంలో ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యను అందించేలా ఒకే వ్యవస్థతో పర్యవేక్షించడం మంచి పరిణామం.’’ అని సెంచూరియన్ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు పేర్కొన్నారు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, +91 94919 99678; ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here