కర్నూలు నగరంలో మొబైల్ రైతుబజార్లు

104

కర్నూలు, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూనే నిత్యావసర కూరగాయలకు ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లను వికేంద్రీకరణ చేసి సామాజిక/భౌతిక దూరం (సోషల్/ఫిజికల్ డిస్టెన్స్) బాగా అమలు చేసి కరోనా వైరస్‌ను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవి పట్టన్‌షెట్టి ప్రత్యేక చర్యలు చేపట్టి రైతు బజార్లను రోడ్లపై గ్రీన్ షేడ్స్, సర్కిల్స్ వేసి పెద్ద సంఖ్యలో వికేంద్రీకరణ చేయడంతో పాటు, నిత్యావసర వస్తువుల డోర్ డెలివరీకి చర్యలు చేపట్టారు.

అలాగే, మంగళవారం నాడు మరో వినూత్నమైన ఆలోచనతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో 65 మొబైల్ (ఆటో) రైతు బజార్లను ఏర్పాటు చేసి నగరంలోని అన్ని వార్డులకు పంపి తక్కువ ధరకే ఇంటి ముంగిట్లో నాణ్యమైన కూరగాయలు అందించడంతో మహిళలు, వృద్ధులు, నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో నమోదు అయిన నేపథ్యంలో, లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసి, కూరగాయల కోసం ప్రజలు బయటకు రాకుండా వారి ఇళ్ల వద్దకే పంపడాని కోసం మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవి పట్టన్ షెట్టి ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం నాడు 65 మొబైల్ (ఆటో) రైతు బజార్లను ఏర్పాటు చేసి కర్నూలు నగరంలోని అన్ని వార్డులకు పంపామని, కూరగాయలను, ఆకు కూరలు పండించే రైతులు కూడా ప్రైవేట్ ఆటోల్లో వీధుల్లోకి వెళ్లి అమ్ముతున్నారని, రైతు బజార్ల కూరగాయల ధరలను రోజూ పత్రికల ద్వారా తెలియజేస్తున్నామని, ఎవరైనా అధిక ధరలకు కూరగాయలు అమ్మితే చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ ఎ.డి. సత్యనారాయణ చౌదరి తెలిపారు.