నేటి ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు, క్షుద్రపూజలు అంటూ కొంతమంది కాలాన్ని వృధా చేసుకోవడం విచారకరం. క్షుద్రపూజలు చేయడం వల్ల మోక్షం వస్తుందని, స్వర్గం లభిస్తుందని, డబ్బు లభిస్తుందని, లేనిపోని ఆలోచనలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈరోజు సైన్స్, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది, మనిషి కష్టపడి సాధించలేనిది ఏదీ లేదు. మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మనం కష్టపడి సంపాదించుకోవచ్చు. ఏదో మాయలు, మంత్రాలు ద్వారా మనకు ఏదో లభిస్తుందని లేనిపోని తలనొప్పులు తెచ్చుకొని, కుటుంబాలను జీవితాలను నాశనం చేసుకునే వారిని చూస్తుంటే జాలి పడటం తప్ప ఏమీ చేయలేము.

ఇటీవల జరిగిన ఒక దారుణాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఏదో తెలియని పిచ్చిభక్తితో చేతికందికి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలను అత్యంత కిరాతకంగా తలలు పగలగొట్టి చంపే స్థాయికి దిగజారిపోయారు అంటే, వారిలో ఉన్నటువంటి మానసిక అపరిపక్వత స్పష్టంగా అర్థం అవుతోంది. మనిషికి ఆధ్యాత్మిక చింతన ఉండవచ్చు గానీ, దానిని ఒక వ్యసనం లాగా మార్చుకుని లేనిపోని ఆలోచనలకు వెళ్లి చివరికి పిచ్చివాడిగా తయారవడం చాలా విచారకరం. మనుషుల్లో ఉన్న బలహీనతలను కొంతమంది దొంగ బాబాలు అవకాశంగా మార్చుకుని, వారిని పిచ్చి వారిగా మారుస్తూ, డబ్బు సంపాదించుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవడం నిత్యం మనం వింటూనే ఉన్నాం. దెయ్యాలు, భూతాలు అంటూ ఏవో కట్టు కథలు అల్లి, అవతలి వారిని భయపెట్టి డబ్బులు దోచేయడం కొంతమందికి అలవాటుగా మారింది. కష్టసుఖాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో వస్తూపోతూ ఉంటాయి.

అవి ఏ ఒక్కరికో పరిమితం కాదు, కొంతమంది కష్టాలు వచ్చేసరికి భయపడి పోయి, రకరకాల మంత్రాలు, తంత్రాలు ఉపయోగించి పిచ్చి ప్రవర్తనకు గురైపోయి తనకు తాను హాని చేసుకోవడం లేక ఇతరులకు హాని చేయడం జరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్కరికి భగవంతుడుపై భక్తి అనేది ఉండాలి కానీ, దానిని జీవితాలు నాశనం చేసుకునే స్టేజీ వరకు తెచ్చుకోకూడదు. పైగా భగవంతుడి శక్తిని పరీక్షించడం తప్పు. కష్టాల్లో ఉన్న వారిని భగవంతుడు ఆదుకుంటాడు గాని, కోరి కష్టాలు తెచ్చుకొని భగవంతుడి మీద నేరాలు మోపడం, భగవంతుని పరీక్షించడం క్షమించరాని నేరాలు తెలిసీ తెలియని మూఢనమ్మకాల వల్ల అనేక జీవితాలు మసిబారిపోవడం చాలా బాధాకరం, మనిషి మేధస్సుతో దేనినైనా సాధించగలరు. మంత్రాలు తంత్రాలు వలన ఏదో సాధిద్దామనే దురాలోచనలు మానుకోవాలి.

సినిమాల్లో సీరియల్‌లో గ్రాఫిక్స్ రూపంలో రకరకాలుగా మంత్రాలు తంత్రాలు చూపిస్తారు కానీ, నిజ జీవితంలో అవన్నీ సాధ్యం కాదు. ఏదో ప్రేక్షకులను రంజింపచేయాలని, డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో సినిమా వాళ్లు మ్యాజిక్కులు చేస్తారు గానీ, నిజజీవితంలో అలాంటివి జరగవు. ఒకప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందని టైంలో, మూఢనమ్మకాలను ప్రజలు నమ్మేవారు అంటే ఒక అర్థం ఉంది. నేడు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి, మనిషి చంద్రమండలానికి చేరుకునే తెలివితేటలను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఈ సృష్టిపై, సృష్టి నిర్మాణంపై పట్టు సాధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ తన తెలివితేటలతో ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన సందర్భాన్ని ఎవరూ మర్చిపోకూడదు.

మనిషి మరణించిన తర్వాత మోక్షానికి వెళ్తాడో లేదా తిరిగి జన్మిస్తాడో అనే విషయాలు భగవంతుడు నర్మగర్భంగా ఉంచడం జరిగింది. లేనిపోని ఆలోచనలతో మనుషులను చంపుకునే స్థాయికి దిగజార కూడదు. ఇలాంటి పరిస్థితులు రాకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ప్రజలను మూఢనమ్మకాలు వైపు, క్షుద్ర పూజలు వైపు వెళ్లకుండా అరికట్టే ప్రయత్నం చేయాలి. దైవభక్తి మంచిదే గాని, అది గాడి తప్పి ప్రాణాలు తీసే వరకు వెళ్లడం మంచిది కాదు. ఇకనైనా అందరూ మూఢనమ్మకాలను విడిచి పెడితే మంచిది.