న్యూఢిల్లీ, డిసెంబర్ 1 (న్యూస్‌టైమ్): కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీపై పనిచేస్తున్న మూడు బృందాలతో ప్రధానమంత్రి దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ బృందాల్లో పూణేలోని జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌తో పాటు హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఈ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఉన్నాయి. కోవిడ్-19 అరికట్టడానికి అవసరమైన టీకా పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ సంస్థలలోని శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రశంసించారు.

వ్యాక్సిన్ అభివృద్ధికి వివిధ వేదికల సామర్థ్యాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. నియంత్రణ ప్రక్రియలు, సంబంధిత విషయాలకు సంబంధించి కంపెనీలు తమ సూచనలు, ఆలోచనలను బయటకు తెలియజేయాలని ప్రధానమంత్రి కోరారు. వ్యాక్సిన్ గురించి, దాని సమర్థత మొదలైన సంబంధిత విషయాల గురించి, సాధారణ ప్రజలకు, సాధారణ భాషలో తెలియజేయడానికి వీలుగా ఆయా కంపెనీలు అదనపు ప్రయత్నాలు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. టీకాలు పంపిణీ చేయడంలో, రవాణా వాహనాలు, రవాణా విధానాలు, శీతల నిల్వ సౌకర్యాలు మొదలైన వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.

ఈ సంస్థల్లో వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రయత్నాలు వివిధ దశలలో ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం, వాటి ఫలితాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మన దేశంతో పాటు, మొత్తం ప్రపంచ అవసరాలను తీర్చడం కోసం, ఈ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే విధంగా తయారీదారులతో పరస్పరం చర్చలు జరిపి, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.