‘ఆక్స్‌ఫర్డ్‌’ డిక్షనరీలో మరిన్ని భారతీయ పదాలు

84

న్యూఢిల్లీ, జనవరి 25 (న్యూస్‌టైమ్): ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో కొత్తగా 26 భారతీయ పదాలకు చోటు దక్కింది. ఇందులో ఆధార్‌, చావల్‌ (బియ్యం), డబ్బా, హర్తాల్‌ (ధర్నా), షాదీ (వివాహం) వంటి పదాలు ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని పదాలను ఏటా ఎంపిక చేసి తన డిక్షనరీలో పొందుపరుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో శుక్రవారం ‘ఆక్స్‌ఫర్డ్‌ అడ్వాన్స్‌డ్‌ లర్నర్స్‌ డిక్షనరీ’ పదో ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంగ్లిష్‌ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన వెయ్యికి పైగా పదాలకు చోటు కల్పించింది. ఇందులో 26 భారతీయ పదాలు ఉన్నాయి. వీటిలో 22 పదాలు ముద్రిత డిక్షనరీలో కనిపిస్తాయని, మిగతావి ఆన్‌లైన్‌ డిక్షనరీలో కనిపిస్తాయని ఓయూపీ ఎండీ ఫాతిమా తెలిపారు.

ఆంటీ, బస్టాండ్‌, డీమ్డ్‌ యూనివర్సిటీ, ఎఫ్‌ఐఆర్‌, వెజ్‌, నాన్‌వెజ్‌, రీడ్రెస్సల్‌, టెంపో, ట్యూబ్‌లైట్‌, వీడియోగ్రాఫ్‌ వంటివి ముద్రిత డిక్షనరీలో కనిపిస్తాయని, కరంట్‌, లూటర్‌, లూటింగ్‌, ఉప జిల్లా పదాలు ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో మాత్రమే కనిపిస్తాయని వివరించారు.

మొత్తంగా చూసుకుంటే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఇప్పటి వరకూ 384 భారతీయ పదాలకు చోటు దక్కింది. చాట్‌బోట్‌, ఫేక్‌ న్యూస్‌, మైక్రోప్లాస్టిక్‌ వంటి పదాలకు కూడా ఏడాది ఎడిషన్‌లో చోటు దక్కింది. వినియోగదారులు తమ డిక్షనరీలోని పదాలను మరింత లోతుగా అర్థం చేసుకునేలా, వాటిని సరైన సమయంలో వినియోగించేలా వాటి నిర్వచనం, ఉదాహరణలు, పర్యాయ పదాలు, ఆయా పదాలను ఎలా? ఎక్కడ వినియోగించాలి? వంటి వివరాలను ఈ ఎడిషన్‌లో పొందుపరిచామన్నారు.

కొత్త డిక్షనరీ తమ వెబ్‌సైట్‌తోపాటు ‘ఓఏఎల్‌డీ’ యాప్‌లోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఓయూపీ వెబ్‌సైట్‌లో పలు అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచినట్టు వెల్లడించారు. ఇంగ్లిష్‌కు సంబంధించిన ఆడియో, వీడియో తరగతులు, స్వీయ అభ్యసనానికి ఐ-రైటర్‌, ఐ-స్పీకర్‌, టెక్స్‌ చెకర్‌ వంటి టూల్స్‌ వంటివి పొందుపరిచినట్టు వివరించారు.

‘‘నిత్య జీవితంలో వాడకం, విస్తృతి వంటి లక్షణాలే కొత్త పదాల ఎంపికకు ప్రామాణికం. ప్రజలు ఇంగ్లిష్‌ మాట్లాడేటప్పుడు తమ ప్రాంతీయ భాషలకు చెందిన ఏయే పదాలను విరివిగా వినియోగిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా శోధిస్తాం. ఆ పదాలకు ఉన్న విస్తృతిని పరిశీలించి, ఆ తర్వాత తుది జాబితాలోకి ఎంపిక చేస్తాం’’ అని ఫాతిమా పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ 77 ఏళ్లుగా డిక్షనరీలను ముద్రిస్తోంది. మొదట 1942లో జపాన్‌లో ముద్రణ ప్రారంభించింది. 1948 నుంచి ఓయూపీలో ముద్రిస్తున్నారు. ఓఏఎల్‌డీ యాప్‌లో 86వేల పదాలు, 95వేల పదబంధాలు, 1.12 లక్షల అర్థాలు, 2.37 లక్షల ఉదాహరణలు పొందుపరిచారు.