రిమ్స్‌లోని కాన్సుల విభాగం తరలింపు

0
5 వీక్షకులు
జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మాతా, శిశు వైద్యశాలను సందర్శించినప్పటి దృశ్యం

ఒంగోలు, ఏప్రిల్ 18 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (రిమ్స్)లోని కాన్పుల విభాగాన్ని స్థానిక మాతా, శిశు వైద్యశాలలోకి తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక మాతా, శిశు వైద్యశాలను జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. షన్మోహన్‌తో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు.

ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్-19 కేసులు వస్తున్న నేపథ్యంలో గర్భిణీలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మార్పు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాన్పుల విభాగానికి సంబంధించి వైద్యులు, యంత్రాలు, పరికరాలు, ల్యాబ్‌ను ప్రస్తుతానికి ప్రసూతి వైద్యశాలకు అనుసంధానం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం అవసరమైన సౌకర్యాల ఏర్పాటు కోసం వనరులు సమకూర్చుతామని, మెరుగైన వసతులు వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా ఆయన ప్రసూతి వైద్యశాలలోని కాన్సుల గది, గర్బిణీలను పరీక్షించే గదులు, స్కానింగ్ గది, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్, కాన్పులకు సంబంధించిన వివిధ విభాగాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. చెడిపోయిన ఆర్వో ప్లాంటు తక్షణమే మరమత్తులు చేయాలన్నారు.

నీటి వినియోగం కోసం వైద్యశాల భవనంపై అదనంగా ట్యాంకులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 18 గదులను పూర్తి స్థాయిలో ప్రసూతి వైద్య సేవల కోసం వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గర్భిణీలు, బాలింతలు, శిశువులకు నిరంతరం వైద్య సేవలు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కరోనా వైరస్ కేసులకు వైద్యం అందిస్తున్న నేపథ్యంలో కిడ్ని డయాలసిస్ కేంద్రాన్ని వేరొక భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైద్య శాఖ ఇంజనీర్ రవి, ప్రసూతి వైద్యశాల వైద్య అధికారిణి డాక్టర్ రమ, తదితరులు వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here