సింగపూర్ ఆసుపత్రిలో అమర్‌సింగ్ చికిత్సపొందుతన్నప్పటి దృశ్యం

సింగపూర్, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ ఇక లేరు. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌ గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన కుటుంబం కూడా ఐసీయూ పక్కనే ఓ గది తీసుకొని ఉంటున్నట్టు సమాచారం. అమర్‌ సింగ్‌ వయస్సు 64 ఏళ్లు. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్‌సింగ్‌ కీలకంగా వ్యవహరించారు.

అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్‌, సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అమర్‌సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003 జూన్‌లో, తాజాగా 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. అమర్‌ సింగ్‌ మరణం పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అమర్‌ సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా సంతాపం తెలిపారు. అమర్‌సింగ్‌ మరణవార్త తననెంతో బాధించిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేవారని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ గుర్తుచేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అమర్‌సింగ్‌ ట్విటర్‌లో చాలా చురుగ్గా ఉంటున్నారు. సమకాలీన అంశాలపైనా ఎప్పటికప్పుడు స్పందించడంతో పాటు ఈ రోజు మధ్యాహ్నం కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్‌ పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here