నెల్లూరు, సెప్టెంబర్ 20 (న్యూస్‌టైమ్): జిల్లాలో 173.67 ఎకరాలలో నిర్మించనున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వాడను అన్ని వసతులతో పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ పారిశ్రామికవాడగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఏపీ పరిశ్రమలు, ఐ.టి. శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆత్మకూరు మండలం నారంపేట వద్ద ఎ.పి. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఎం.ఎస్.ఎం.ఇ. పారిశ్రామివాడ శంఖుస్థాపన కార్యక్రమంలో మేకపాటి గౌతం రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడతగా 87 ఎకరాలలో పారిశ్రామికాడ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, తద్వారా 4 వందల కోట్ల పెట్టుబడితో ఫర్నీచర్, ప్లాస్టిక్ పరిశ్రమలు రానున్నాయని, అందుకు సంబంధించి 337 పరిశ్రమల ప్లాట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో సిబ్బందికి, యాజమాన్యానికి వసతి ఏర్పాటుతో పాటు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తేనున్నామని ఆయనన్నారు. రైతులు తమ పిల్లలను పక్కరాష్ట్రాల్లో చదివించి ఉపాధి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు పంపుతున్నారని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు ఇక్కడే మెండుగా ఏర్పడతాయని ఆయనన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ వున్న పరిస్థితులు, వసతుల దృష్ట్యా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేదా ఆహార పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నారం పేటలో పారిశ్రామిక వాడ ఏర్పాటు ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆయనన్నారు.

ఫేస్-2 ఇరిగేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఆయనన్నారు. 6 టి.ఎం.సి.ల నీటిని వినియోగించనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష్యత వహించిన జిల్లా కలెక్టరు కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలలో 75 శాతం స్థానికులకు కేటాయించడం యువతకు మంచి వరమన్నారు. జిల్లాలో 30 శాతం మంది యువత వున్నారని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాది అవకాశాలు మెరుగుపడతాయని ఆయనన్నారు. నెల్లూరులో పరిశ్రమల ఏర్పాటుకు మెరుగైన అవకాశాలు వున్నాయని, నెల్లూరు నుండి తడ వరకు జాతీయ రహదారి వుండడమేకాక సముద్ర రవాణాకి కూడా అవకాశం మెండుగ వున్నదని ఆయనన్నారు. నెల్లూరు ప్రజలు కష్టపడి పనిచేసే వారని ఆయన కొనియాడారు. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ విద్యా సంవత్సరంలో 6 నెలల విద్యాకాలాన్ని నష్టపోయామని సెప్టెంబరు, అక్టోబరు నెలలలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్న దృష్ట్యా తల్లిదండ్రులు వారి పిల్లలకు సామాజిక దూరం, మాస్కులు ధరించేందుకు, తరచు చేతులు శుభ్రపరచుకొనేందుకు, తదితర అంశములపై అవగాహన కల్పించి పాఠశాలలకు పంపించాలని ఈ విద్యా సంవత్సరాన్ని వృధాకానీయకుండా తమ వంతు సహకారాలు అందించాలని ఆయన కోరారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఆత్మకూరు ప్రాంతం అన్ని విధాల అనువైన ప్రదేశమని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు, సూళ్లూరు పేట, ఉదయగిరి శాసన సభ్యులు వి. వరప్రసాదరావు, కిలివేటి సంజీవయ్య, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, తమ నియోజకవర్గాలలో కూడా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్.డి.ఓ. సువర్ణమ్మ, ఎ.పి.ఐ.ఐ.సి. చీఫ్ జనరల్ మేనేజరు రామాంజనేయులు, ఎ.పి.ఐ.ఐ.సి. జోనల్ మేనేజరు జె. చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మెన్ వై. అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.