మొఘల్ సామ్రాజ్యాధిపతి!

0
5 వీక్షకులు
  • బాబర్ గురించి ఏం తెలుసు?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (న్యూస్‌టైమ్): మొఘల్ సామ్రాజ్యం గురించి వినడమే గానీ, చూడని వారు, పూర్తిగా తెలియని వారూ అనేకం. దక్షిణాసియాలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ పేరు ఈ మూడక్షరాలే కాదండోయ్. చాలా పొడవైనదే. కావాలంటే చదవండి.. ‘అల్ సుల్తాన్ అల్ ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ’, కాగా ఈతను బాబర్ నామంతోనే సుప్రసిద్ధుడయ్యాడయ్యాడు.

బాబర్ మధ్య ఆసియాకు చెందిన వాడు. అయితే, దక్షిణాసియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తండ్రి వైపున తైమూర్ లంగ్, తల్లి వైపున చెంఘీజ్ ఖాన్ వంశాలకు చెందిన బాబర్ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు. 16వ శతాబ్దం తొలినాళ్లలో మంగోల్, తురుష్క, పర్షియన్, ఆఫ్హానీ యోధులతో కూడిన మొఘల్ సైన్యాలు, తైమూర్ వంశ యువరాజైన, జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ నాయకత్వంలో భారతదేశంపై దండెత్తాయి. బాబర్, మధ్య ఆసియా మొత్తాన్ని జయించిన మహాయోధుడు తైమూర్ లాంగ్ ముని మనమడు.

తైమూర్ 1398లో భారత్‌పై డండయాత్రకు విఫలయత్నం చేసి సమర్‌ ఖండ్‌కు వెనుదిరిగాడు. తైమూర్ స్వయంగా తాను మరో మంగోల్ యోధుడు చెంగీజ్ ఖాన్ వారసుడినని ప్రకటించుకొన్నాడు. ఉజ్బెక్‌లచే సమర్‌ఖండ్ నుండి తరిమివేతకు గురైన బాబర్ మొదటగా 1504లో కాబూల్‌లో తన పాలనకు శ్రీకారం చుట్టాడు. ఆ తరువాత ఇబ్రహీం లోఢీ పాలిస్తున్న ఢిల్లీ సుల్తానులతో అంత:కలహాలను ఆసరాగా తీసుకొని దౌలత్ ఖాన్ లోఢీ (పంజాబ్ గవర్నరు) ఆలం ఖాన్ (ఇబ్రహీం లోఢీ మామ)ల ఆహ్వానంతో బాబరు 1526లో ఢిల్లీపై దండెత్తాడు.

అనుభవమున్న సేనానిగా బాబర్ తన సుశిక్షుతులైన 12 వేల సైన్యంతో 1526లో భారతదేశంలో అడుగుపెట్టి లోఢీ సమైక్యతలోపించిన లక్ష బలం కల భారీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్, సుల్తాన్ లోడీని నిర్ణయాత్మకంగా ఓడించాడు. తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు, ఆ కాలం నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయంతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్.

ఆ యుద్ధంలో సుల్తాన్ లోఢీ మరణించాడు. ఒక సంవత్సరం తర్వాత (1527) కణ్వా యుద్ధంలో చిత్తోర్ రాజు రాణా సంగ్రామ్ సింగ్ నేతృత్వంలోని రాజపుత్రుల సంఘటిత సేనను నిర్ణయాత్మకంగా ఓడించాడు. బాబర్ పాలనలో మూడవ పెద్ద యుద్ధం 1529లో జరిగిన గోగ్రా యుద్ధమనే చెప్పాలి. ఇందులో బాబర్ ఆఫ్ఘన్, బెంగాల్ నవాబలకు చెందిన సంయుక్త సేనలను మట్టికరిపించాడు. తన సైనిక విజయాలను పటిష్టపరచే మునుపే బాబర్ 1530లో ఆగ్రా వద్ద మరణించాడు.

తన ఐదేళ్ళ చిన్న పాలనాకాలంలో బాబర్ అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ వహించాడు. కానీ అందులో కొన్ని మాత్రమే మనగలిగాయి. బాబర్ తన అత్యంత ముఖ్యమైన వారసత్యంగా భవిష్యత్తులో భారత ఉపఖండంపై సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తన స్వప్నాన్ని సాకారం చెయ్యగల వారసులను అయితే మిగిల్చిపోయాడు. బాబర్ ఫిబ్రవరి 14, 1483న జన్మించాడు. ఇతడి జన్మస్థలం ఉజ్బెకిస్తాన్‌ ఫెర్గనా లోయలోని అందిజాన్ పట్టణం. ఇతని తండ్రి ఉమర్ సేహ్ మిర్జా. ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు, ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తె ఖుత్లుఖ్ నిగార్ ఖానమ్.

ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగ వాడు, తరువాత ఈ తెగ తురుష్క (టర్కిక్ తెగ) ప్రజలుగా మార్పు చెందారు. పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు. ఇతడి మాతృభాష చగ్తాయి భాష, టర్కిక్ భాష, పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు. ఇతను తన స్వీయ చరిత్ర (ఆత్మకథ)ను బాబర్ నామా పేరిట పర్షియన్ భాషలో రచించాడు. భోపాల్‌లోని ప్రభుత్వ గ్రంధాలయంలో దొరికిన పత్రాల ప్రకారం బాబర్ హుమాయూన్‌కు ఈ కింది వీలునామా రాసాడు.

‘‘నా ప్రియ కుమారునికి, ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోదగినవి… నీ మనస్సులో మతవిద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయము చెప్పేటప్పుడు, ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తాయి. ప్రజల ప్రార్ధనాలయాలను ఏ మతానికి చెందినవైనా ధ్వంసం చేయవద్దు. దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లామును ప్రచారంచేయటానికి , ఇతర మతాలను అన్యాయముతో, కౄరంగా అణచివేయటము అనే కత్తుల కన్నా ప్రేమా, ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు, సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే, నీ ప్రజల గుణగణాలను చూడు’’ అని ఆ వీలునామాలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here