23న ఫ్లాట్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి…

న్యూఢిల్లీ, నవంబర్ 22 (న్యూస్‌టైమ్): పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్లను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2020 నవంబర్, 23వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరుకానున్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ బి.డి. మార్గ్ వద్ద ఈ ఫ్లాట్లను నిర్మించారు. 80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎనిమిది పాత భవనాల స్థానంలో ఇప్పుడు 76 ఫ్లాట్లను నిర్మించారు. మంజూరు చేసిన వ్యయం కంటే సుమారు 14 శాతం పొదుపుతో ఈ ఫ్లాట్ల నిర్మాణం పూర్తయ్యింది. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ సకాలంలో ఈ ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.

ఈ నిర్మాణంలో ఫ్లై బూడిద, నిర్మాణం, కూల్చివేత వ్యర్థాలతో తయారు చేసిన ఇటుకలు; థర్మల్ ఇన్సులేషన్, శక్తి సామర్థ్యం కోసం డబుల్ గ్లేజ్డ్ కిటికీలు; విద్యుత్తును పొదుపు చేయడానికి ఉపకరించే ఎల్.ఈ.డి. బల్బులు, ఉపకరణాలు; మనుషులు ఉన్నప్పుడు మాత్రమే దీపాలు వెలిగే విధంగా సెన్సార్ల ఏర్పాటు; తక్కువ విద్యుత్తు వినియోగం కోసం వి.ఆర్.వి. వ్యవస్థ కలిగిన ఎయిర్ కండీషనర్లు, నీటి సంరక్షణ కోసం తక్కువ వేగంతో నీటిని విడుదల చేసే ఉపకరణాల ఏర్పాటు; వర్షపు నీటి సేకరణ వ్యవస్థ, పైకప్పు మీద సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు వంటి అనేక హరిత భవన నిర్మాణ కార్యక్రమాలను అమలుచేశారు.