తెలంగాణ పుర ఫలితం నేడే

52

హైదరాబాద్, జనవరి 25 (న్యూస్‌టైమ్): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం పదింటికల్లా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 27న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది.

ఈ నెల 22న ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. మొత్తం 3,029 వార్డులు, డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లుచేసింది. ఇంకోవైపు, కరీంనగర్‌ కార్పొరేషన్‌లో శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 58 డివిజన్లలో 62.52 శాతం పోలింగ్‌ నమోదయింది.

ఇక్కడ ఓట్ల లెక్కింపును సోమవారం చేపడతారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మూడు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ ముగిసింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్లవారీగా ఓట్ల లెక్కింపుకోసం అధికారులు మొత్తం 2,619 టేబుళ్లు, 1,370 టీమ్‌లను ఏర్పాటుచేశారు. 3,018 మందిని సూపర్‌వైజర్లుగా, 5,876 మందిని అసిస్టెంట్లుగా నియమించారు.

మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తిచేయడానికి పురపాలకశాఖతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 8,894 మంది సిబ్బందిని వినియోగిస్తోంది. కాగా, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. సాయంత్రం వరకు దాదాపు అన్ని ఫలితాలు వెలువడుతాయని, మొదటి ఫలితం ఉదయం 10 గంటలలోపు వచ్చే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం పురపాలకశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న మేయర్‌, చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ ఎన్నిక నిర్వహణకోసం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జిల్లాకలెక్టర్లు ఒక గెజిటెడ్‌ అధికారిని ప్రిసైడింగ్‌ అధికారిగా నియమిస్తారని తెలిపారు.

సమానంగా ఓట్లువస్తే లాటరీ ద్వారా చైర్మన్‌ ఎంపిక ఉంటుందని నాగిరెడ్డి చెప్పారు. వార్డు ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులకు, ఎక్స్‌అఫీషియో అభ్యర్థులకు మేయర్‌, చైర్‌పర్సన్ల ఎంపిక సమావేశానికి హాజరుకావాలని నోటీస్‌లు ఇస్తారని చెప్పారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎంపిక కోసం గుర్తింపుపొందిన రాజకీయపార్టీలు ఎన్నికకు ఒకరోజు ముందుగా ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకు ఫామ్‌- ఏ, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్ల పేర్లను తెలుపుతూ ఎన్నిక జరిగే రోజు ఉదయం 10 గంటలకు ఫామ్‌-బీని ప్రిసైడింగ్‌ అధికారికి అందించాల్సి ఉంటుందన్నారు. ఎన్నిక నేపథ్యంలో రాజకీయపార్టీలు విప్‌లను నియమించుకోవచ్చునని తెలిపారు. విప్‌ల నియమానికి సంబంధించి ఫామ్‌-1,ఫామ్‌ 2, ఫామ్‌ 3ల ద్వారా తెలియజేయాలని చెప్పారు.

మేయర్‌, చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా స్పెషల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల నియమావళి ఈనెల 25 నుంచి అమలులోకి వస్తుందని నాగిరెడ్డి వివరించారు. ఈ సమయంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు పోటీచేసేవారుగానీ, ఆయా రాజకీయ పార్టీలు గానీ ఓట్ల కోసం పదవులు ఇస్తామంటూ ఎలాంటి హామీ ఇవ్వకూడదని చెప్పారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈసారి గత ఎన్నికలకంటే పోలింగ్‌శాతం తగ్గిందని వివరించారు. మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటుహక్కు ఉంటుందని పురపాలకశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి తెలిపారు.

ఎక్స్‌అఫీషియో సభ్యులైన లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ మున్సిపాలిటీలుగానీ, కార్పొరేషన్లుగానీ ఉంటే తమ ఓటును ఎక్కడ వినియోగించుకోవాలనుకుంటున్నారో ముందుగానే ఆప్షన్‌ ఇవ్వాలని చెప్పారు. అలాగే రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాలు ప్రత్యేకంగా లేనప్పుడు వారు ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో ఆప్షన్‌ తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే పరిధిలో ఒక్కటే మున్సిపాలిటీ ఉంటే ఎక్స్‌అఫీషియో హోదాలో అక్కడే ఓట్లు వేయాలని తెలిపారు.