వనిత, విజయ్‌కుమార్

చెన్నై, డిసెంబర్ 24 (న్యూస్‌టైమ్): వ‌నితా విజ‌య‌కుమార్ ఈ పేరు సినిమాల్లో కంటే వివాదాల‌లోనే ఎక్కువ‌గా వినిపిస్తుంటుంది. ప్ర‌ముఖ సినీ దంప‌తులు విజ‌య్‌కుమార్, మంజుల పెద్ద కుమార్తె అయిన వ‌నితా విజ‌య్‌కుమార్ వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో మ‌లుపులు జ‌రిగాయి. ముఖ్యంగా ప్రేమ‌, పెళ్లిళ్ల విష‌యంలో ఆమె ఎన్నో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు.

అలాగే ప్రాప‌ర్టీ విష‌యంలోనూ త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఆమెకు చాలా గొడ‌వ‌లు ఉన్నాయి. ఈ లాక్‌డౌన్‌లో పీట‌ర్ పాల్‌ని వ‌నితా మూడో వివాహం చేసుకోగా మూడు నెల‌లు కాక‌ముందే ఆ పెళ్లి పెటాకులైంది. త‌న‌కంటే మందునే పీట‌ర్ అమితంగా ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని, త‌న‌ను వ‌దిలి వెళ్లిపోయాడ‌ని ఆమె వివ‌రించింది. అంతేకాదు ఇప్పుడు మ‌రోసారి ప్రేమలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల వ‌నితా ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఆమెను కొంత‌మంది ప్ర‌శంసిస్తున్న‌ప్ప‌టికీ విమ‌ర్శించేవారు కూడా చాలామందే ఉన్నారు.

కాగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వ‌నితా ప‌లు ఆసక్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. త‌న లైఫ్‌లో త‌న తండ్రే త‌న విల‌న్ అని, త‌న‌కు రావాల్సిన ఆస్తిని కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె తెలిపారు. త‌న త‌ల్లి ఎంతో క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు సంపాదించిద‌ని, ఆమెను మోసం చేస్తూ, ఆమెకు తెలీకుండా త‌న తండ్రి ఆస్తుల‌ను పంచార‌ని అన్నారు. త‌న నాన్న త‌న‌ను బెదిరించార‌ని, త‌మిళ‌నాడులో లేకుండా చేస్తాన‌ని అన్నార‌ని తెలిపారు. ఒక‌వేళ ఈ స‌మ‌యానికి త‌న తల్లి బ‌తికి ఉండి ఉంటే త‌న‌కు వ‌చ్చిన ఈ ప‌రిస్థితిని చూసి బాధ‌ప‌డేద‌ని, త‌న‌కు ఏదో ఒక న్యాయం చేసేద‌ని అన్నారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో పోలీసుల చేత న‌న్ను బ‌య‌టికి గెంటేశార‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు.

త‌న కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికీ త‌న‌ను ఆ ఇంటి స‌భ్యురాలిగా గుర్తించ‌ర‌ని, మిగిలిన వారంద‌రికీ న్యాయం చేసి త‌న‌కు అన్యాయం చేశార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికీ న్యాయం కోసం తాను పోరాడుతున్నాన‌ని అన్నారు. త‌న తండ్రి ఇంటిలో నుంచి గెంటేసిన త‌రువాత ఒక సంవ‌త్స‌రం పాటు చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, క‌ర్ణాట‌క‌లో ఉంటూ త‌న స్నేహితుల సాయంతో ఎన్నో ప‌నులు చేసి మ‌ళ్లీ నిల‌దొక్కుకున్నాన‌ని అన్నారు. ఇక తాను బిగ్‌బాస్‌కి వెళ్లిన‌ప్పుడు త‌న స్నేహితులు, బిగ్‌బాస్ నిర్వాహ‌కులు త‌న కుమార్తెల‌ను చూసుకున్నార‌ని అందుకు వారికి కృతఙ్ఞ‌త‌లని తెలిపారు. ఇక ఇప్పుడు తాను రోజు వార్త‌ల్లో ఉంటున్నాన‌ని ఇప్పుడు త‌న తండ్రిని వ‌నితా విజ‌య్‌కుమార్ తండ్రి అని అంటున్నార‌ని.. అది త‌న గుర్తింపు అని పేర్కొన్నారు.