నారా లోకేశ్‌ నామినేషన్‌ ఆమోదం

200

గుంటూరు, మార్చి 26 (న్యూస్‌టైమ్): రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ కలిగించిన మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ నామినేషన్‌ వ్యవహారం చివరికి సద్దుమణిగింది. లోకేశ్ నామినేషన్ చెల్లదంటూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన వాదనను తోసిపుచ్చుతూ రిటర్నింగ్‌ అధికారి పత్రాలను ఆమోదించారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోకేశ్‌ నామినేషన్‌లో తప్పులు ఉన్నట్టు వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయన నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే, లోకేశ్‌ తరఫు న్యాయవాదులు ఆర్వోను ఒక్క రోజుపాటు సమయం కోరడంతో ఆయన నామపత్ర పరిశీలన బుధవారానికి వాయిదా పడింది.

అయితే, లోకేశ్ న్యాయవాదులు సంబంధిత పత్రాలను మంగళవారమే సమర్పించడంతో నామినేషన్ పత్రాలను అధికారులు ఆమోదించారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో సీఎం తనయుడు లోకేశ్‌ పోటీ చేస్తున్నారు. వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ స్థానంలో బరిలో ఉండటంతో మంగళగిరిలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.