క్రీడల్లో రాణిస్తేనే జాతీయ స్థాయి గుర్తింపు

108

విశాఖపట్నం, నవంబర్ 27 (న్యూస్‌టైమ్): క్రీడల్లో రాణిస్తేనే జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని ఆంధ్రా యూనివర్సిటీలోని దూర విద్యా విభాగం సంచాలకుడు ఆచార్య పూజారి హరిప్రకాష్‌ తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన అంతర కళాశాలల క్రీడా పోటీల్లో బాక్సింగ్‌ (హెవీవెయిట్‌)లో అద్భుత ప్రతిభ కనబరిచిన బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థి సింగూరు హేమంత రాజును ఆచార్య హరిప్రకాష్‌ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.

హేమంతరాజు నగరంలోని ప్రిజమ్‌ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్నాడు. హెవీవెయిట్‌ బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించాడు. అంతేకాదు 2017,2018, 2019 సంవత్సరాల్లో వరుసగా మూడేళ్లు బాక్సింగ్‌లో బంగారు పతకాలు సాధించిన హేమంతరాజుకు అద్భుత భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి విభిన్న పథకాలతో క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నట్టు గుర్తుచేశారు. చదవుతో పాటు క్రీడల్లో కూడా ప్రవేశం ఉంటేనే విద్యార్థులు అద్భుత విజయాలు సొంతం చేసుకోవచ్చన్నారు. క్రీడలు మానసిక ఉల్సాసంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయని చెప్పారు.

క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలతోపాటు ఉద్యోగావకాశాలు కూడా విస్తృతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. బంగారు పతకం గెలిచిన విద్యార్థి హేమంత రాజు తండ్రి సింగూరు విశ్వనాథం కస్టమ్స్‌ డిపార్టుమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంజీవిని కళాశాలల కరస్పాండెంట్‌ సిహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ ఎం.సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.