కోవిడ్-19 నిరోధక పోరులో ఎన్‌సీసీ సేవ‌లు

50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): క‌రోనా వైర‌స్ ( కోవిడ్ -19) మ‌హ‌మ్మారిని నిరోధించే కార్య‌క్ర‌మాల్లో నేష‌న‌ల్ కాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)కు చెందిన సీనియ‌ర్ డివిజ‌న్ క్యాడెట్స్ సేవ‌లు కావాల‌ని కోరుతూ సివిల్, పోలీసు విభాగాల‌ నుంచి విన‌తులు అందుతున్నాయి. ఈ మేర‌కు ఎన్‌సీసీకి సంబంధించివారు కొంద‌రు సోమవారం నుంచే త‌మ సేవ‌ల‌ను మొద‌లుపెట్టారు. ర‌క్ష‌ణ శాఖ ఇప్ప‌టికే ‘ఎక్స‌ర్‌సైజ్ ఎన్‌సిసి యోగ్ దాన్’ కార్య‌క్ర‌మం కింద ఎన్‌సిసి క్యాడెట్ల‌కు తాత్కాలిక ఉద్యోగాల‌ను క‌ల్పిస్తోంది. దీనికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుద‌ల చేశారు.

ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, మునిసిప‌ల్ విభాగాలు చేప‌ట్టే స‌హాయ చ‌ర్య‌ల్లో వీరు సేవ‌లు అందిస్తారు. ల‌ద్దాహ్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నీముచ్ ఎస్పీ, బిలాస్‌పూర్ క‌లెక్ట‌ర్ త‌మ‌కు ఎన్‌సిసి క్యాడెట్ల సేవ‌లు కావాల‌ని కోరారు. కొంత మందికి తాత్కాలిక ఉద్యోగం క‌ల్పించ‌గా మ‌రికొంత మందిని వాలంటీర్లుగా నియ‌మించుకొని వారికి కోవిడ్-19పై పోరాటానికి సంబంధించి త‌గిన శిక్ష‌ణ అందిస్తారు. పంజాబ్‌, హ‌ర్యానా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్, ఛ‌త్తీస్‌గ‌డ్ డైరెక్ట‌రేట్ ప‌రిధిలోని ఎన్‌సిసి క్యాడెట్ల సేవ‌లు కావాల‌ని కోరుతూ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కంగ్రా జిల్లా డిప్యూటీ క‌మిష‌న‌ర్ విన‌తిప‌త్రం ఇచ్చారు. త‌మ న‌గ‌రం ప‌రిధిలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌న భౌతిక దూర‌ముండేలా చూడ‌డానికిగాను పోలీసు శాఖ‌కు వీరి సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటామ‌ని డిప్యూటీ క‌మిష‌న‌ర్ తెలిపారు.

అలాగే త‌మిళ‌నాడుకు చెందిన కాంచీపురం జిల్లా పోలీసు అధికారులు, పుదుచ్ఛేరి అధికారులు అక్క‌డి ఎన్‌సిసి సేవ‌ల‌ను వాడుకుంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రాంపూర్ జిల్లా అధికారులు కూడా అక్క‌డి గోర‌ఖ్‌పూర్ ఎన్‌సిసి గ్రూప్ ప్ర‌ధాన కార్యాల‌యానికి ఉత్త‌రం రాసి అక్క‌డి ఎన్‌సిసి సేవ‌ల‌ను కోరారు. ఇప్ప‌టికే కొంత‌మంది క్యాడెట్లు సేవ‌ల‌ను ప్రారంభించారు. మేఘాల‌య రాష్ట్రంలోని తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలో అక్క‌డి పోలీసుల‌కు ఎన్‌సిసి క్యాడెట్లు సేవ‌లందిస్తున్నారు. రేష‌న్ పంపిణీలోను, పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల్లోను వారు సాయం చేస్తున్నారు. హెల్ప్ లైన్ లేదా కాల్ సెంట‌ర్ల‌లోను, స‌హాయ‌క సామ‌గ్రి పంపిణీలోను, మందులు, ఆహారం ఇంకా ఇత‌ర అత్య‌వ‌స‌ర వ‌స్తువుల పంపిణీలోను, క‌మ్యూనిటీ స‌హాయంలోను, డాటా నిర్వహ‌ణ‌లోను, క్యూల‌ను, ట్రాఫిక్‌ను నిర్వ‌హించ‌డంలోను, సిసిటివి కంట్రోల్ రూముల‌లో సేవ‌లందించ‌డానికి ఎన్‌సిసి క్యాడెట్ల‌ను ఉప‌యోగించుకుంటున్నారు.

రాష్ట్ర లేదా జిల్లా అధికారులు ఆయా ఎన్‌సిసి డైరెక్ట‌రేట్ల‌కు విన‌తి ప‌త్రాలు రాసి ఎన్‌సిసి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఆయా డైరెక్ట‌రేట్ల, గ్రూప్ ప్ర‌ధాన కార్యాల‌యాలు, యూనిట్ స్థాయి విభాగాలు ఆయా ప్ర‌భుత్వాల‌తో వివ‌రంగా మాట్లాడి ఎన్‌సిసి సేవ‌లు అందేలా చూస్తాయి. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో ఎన్‌సిసి క్యాడెట్లకు విధుల‌ను కేటాయించ‌డం జ‌రుగుతుంది.