నవభారత శకానికి కొత్త నాంది: మోడీ

137
  • వీఐపీ సంస్కృతిని విడనాడాలని పిలుపు

  • ఎన్డీఏ పక్ష ఎంపీలకు ప్రధానమంత్రి సూచన

  • ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్రుడి ఏకగ్రీవ ఎన్నిక

న్యూఢిల్లీ, మే 25 (న్యూస్‌టైమ్): ఎన్డీఏ కూటమి రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టడానికి సర్వం సిద్ధమైన నేపథ్యంలో నవభారత నిర్మాణం దిశగా తమ ప్రభుత్వం సరికొత్త ఉత్సాహంతో నూతన ప్రయాణం ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కులాలు, విశ్వాసాలకు అతీతంగా పనిచేయాలని, ఎలాంటి వివక్ష చూపకూడదని కొత్తగా ఎన్నికైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) పక్ష ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మైనార్టీల విశ్వాసం చూరగొనాలని సూచించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్ష ఎంపీలందరూ తమ కూటమి నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదించగా, పార్టీ మాజీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్‌గడ్కరీ బలపరిచారు.

ముఖ్య భాగస్వామ్యపక్ష నేతలైన జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌ తమ పార్టీల మద్దతును తెలియజేశారు. 1857 స్వాతంత్య్ర పోరాటాన్ని ఉటంకిస్తూ స్వపరిపాలన కోసం నాడు అన్ని వర్గాల ప్రజలు చేతులు కలిపారని, 2020 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తికానున్న నేపథ్యంలో సుపరిపాలన కోసం నేడు అలాంటి ఉద్యమ స్ఫూర్తే అవసరం అని ప్రధాని చెప్పారు. రాజ్యాంగమే మనకు సుప్రీం. ఇంట్లో మనం ఎలాంటి రకమైన పూజా పద్ధతిని అనుసరించినా ఇంటి వెలుపల మాత్రం భారతమాతకు మించిన దైవం వేరే ఉండదు అని చెప్పారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను 130 కోట్ల మంది దేవుళ్లుగా అభివర్ణించిన ఆయన అందిరికీ ఒకే స్ఫూర్తితో ఒకేవిధంగా సేవలందించాలని సూచించారు.

‘‘మనల్ని విశ్వసించిన వారితోపాటు మనం విశ్వాసం చూరగొనాల్సిన వారివైపు కూడా నిలబడతాం. 21వ శతాబ్దంలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అందరినీ కలుపుకుపోవాలి’’ అని మోదీ అన్నారు. సాధారణంగా ఎన్నికలు విభజన, అగాథాన్ని సృష్టిస్తాయని, అయితే 2019 ఎన్నికలు మాత్రం సమాజాన్ని ఏకం చేసిందని మోదీ పేర్కొన్నారు. దేశంలో నూతన శకం ఆరంభమైందని, ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై సానుకూలతను ప్రతిబింబించాయని చెప్పారు.

ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కనబరిచారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడానికి మించి మెరుగైన మార్గం మరోటి లేదని స్పష్టం చేశారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేసిందని, పేదలే ఈ సారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. జాతీయ కాంక్ష, ప్రాంతీయ ఆకాంక్షలు (నారా)నే కూటమికి తానిచ్చే నినాదమని చెప్పారు. తనతో కలిసి పనిచేయాలని ఎంపీలను కోరారు. అలాగే అహంకారాన్ని వదిలివేయాలని సూచించారు.

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మోదీ తన తల్లి ఆశీర్వాదం తీసుకునేందుకు ఆదివారం గుజరాత్‌కు వెళ్లనున్నారు. తనను రెండో పర్యాయం ఎంపీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం వారణాసికి వెళ్లనున్నారు. పబ్లిసిటీ కోసం మీడియాకు స్టేట్‌మెంట్‌లు ఇవ్వొద్దని, వీఐపీ సంస్కృతి విడనాడాలని ఎంపీలకు మోదీ సూచించారు. ఎలాంటి వివక్ష చూపకుండా పనిచేయాలని, మైనార్టీల విశ్వాసాన్ని చూరగొనాలని పిలుపునిచ్చారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మన మంత్రం కావాలని సూచించారు. మైనార్టీలను భయాందోళనల మధ్య నివసించేలా చేశారని, ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎన్నికల సమయంలో వారిని స్వార్థానికి వినియోగించుకున్నారని ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు, దేశ రాజధానిలో ఈ నెల 30న జరుగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన హాజరుకానున్నారు.

ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ అధికారిక ప్రకటన విడుదలచేసింది. ఈ మేరకు మోదీతో సిరిసేన మాట్లాడారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశాన్ని సిరిసేన ట్విట్టర్‌లో కూడా తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపానని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగే వేడుకల్లో శ్రీలంక కూడా పాలుపంచుకుంటుందని చెప్పినట్టు వెల్లడించారు.