‘‘నేను నా విధులను గురించి మా తల్లి ఒడి నుంచే నేర్చుకున్నాను. ఆమె నిరక్షరాస్యురాలైన గ్రామీణ మహిళ. ఆమెకు నా ధర్మం గురించి తెలుసు. ఆ విధంగా నేను నా చిన్నతనం నుంచే నా ధర్మం గురించి తెలుసుకోగలిగాను. మన ధర్మాన్ని మనం సరిగా నిర్వర్తించినట్లయితే హక్కులు వాటంతట అవే వస్తాయి. ఇందులో గొప్పతనమేమిటంటే మనం నిర్వర్తించే బాధ్యతలే మనకు హక్కు వచ్చేటట్టు చేస్తాయి. అందువల్ల బాధ్యతల నుంచి హక్కులను వేరు చేయలేము. ఆ భావన నుంచే సత్యాగ్రహ పుట్టింది. అందుకే నేను ఎల్లప్పుడూ నా బాధ్యత ఏమిటి? అన్న దానిని నిర్ణయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.’’ అని జాతిపిత మహాత్మా గాంధీ 1947 జూన్ 28న న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రార్థనా సమావేశంలో ప్రాథమిక విధుల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. (ఇదీ చదవండి… ఫలించని ‘న్యూ మీడియా’ పోరాటం…)

ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకన్న సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. రావాలి. ఎందుకంటే? అలా వచ్చినప్పుడే మనం మన బాధ్యతల్ని మరింత ఆచరణాత్మకంగా, ఎదుటివాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిర్వర్తించినప్పుడే మనకు రావాల్సిన హక్కులు మహాత్ముడు చెప్పినట్లు వాటంతట అవే సిద్ధిస్తాయి. అంతేగానీ, కేవలం హక్కుల కోసమే ఎదురుచూస్తూ మన బాధ్యతలను విస్మరించి అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి పట్టించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, కొన్నిసార్లు నష్టపోవాల్సీ వస్తుంది.

ఇక, విషయానికి వస్తే… కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్తుల మేరకు ఏదో ఒకరోజు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ ‘న్యూ మీడియా’ను గుర్తించకమానదు. ఎంపానల్‌మెంట్ చేసి ప్రకటనలు ఇవ్వకపోవచ్చు గానీ, అక్రిడిటేషన్లు జారీచేసి ఆయా సంస్థల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన జర్నలిస్టులను అయితే గుర్తిస్తుంది. ఈ నేపథ్యంలో నిబంధనలను కూడా కచ్చితంగా పాటిస్తూనే ఆ కొత్త రంగాన్ని గుర్తించనుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ, అలా నిబంధనలు కఠినతరంగా ఉంటే దరఖాస్తుచేసుకునే జర్నలిస్టులు, ఛానళ్ల యాజమాన్యాలు ఇబ్బందులు పడకుండా ముందుగానే జాగ్రత్త పడి అవసరమైన అనుమతులన్నీ సిద్ధం చేసుకుని, ఆడిట్ నివేదికల్ని తయారుచేయించి ఉంచుకోవడం మేలు. ‘‘ఆ ఇచ్చినప్పుడు చూసుకుందాం లే’’ అన్న ధోరణిలో ఉన్నవారి సంగతి ఎలా ఉన్నా, ఇదే (న్యూ మీడియా) రంగంపై ఆధారపడి తమ పాత్రికేయ వృత్తిని కొనసాగించాలనుకునే ఔత్సాహికులు మాత్రం ముందుగా జాగ్రత్తపడడం మంచిది.

ఇందులో భాగంగా ‘న్యూ మీడియా’ పరిధిలోకి వచ్చే వారు తమ సంస్థను ముందుగా నమోదుచేయించుకోవడం, అదే పేరిట ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్, జీఎస్‌టీ నివేదికలను, వార్షిక ఆడిట్ నివేదికలను సిద్ధం చేసుకోవడం అత్యవసరం. ఈ ప్రాతిపదికనే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు ‘న్యూ మీడియా’ పరిధిలోకి వచ్చే జర్నలిస్టులను గుర్తిస్తున్నాయి.

ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పటికిప్పుడే తమ పనులను కార్యాచరణలో సంస్థ నిర్వాహకులుగా మీ మీ బాధ్యతలను గుర్తించినట్లవుతుంది. లేకపోతే, ‘వచ్చినప్పుడు చూసుకుందాం లే’ కేటగిరిలో మిగిలిపోవాల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పటికే జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారు కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన గడువులోగా రిటర్ను దాఖలుచేస్తే ఎలాంటి అపరాధ రుసుము ఉండదని స్పష్టంచేసింది. ఇది వరకటి మాదిరిగా MSME నుంచి బ్రాడ్‌కాస్టింగ్ సర్టిఫికేషన్ పొందడం ఇప్పుడు అంత సులువైన పనికాదు. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి తాజా మార్పుల కారణంగా ఎదురైంది.

నాయకుల మాటలు నమ్మకండి.. అన్నీ పరిశీలించండి..

అన్నీ తమకే తెలుసన్నట్లు జర్నలిస్టు సంఘాల నాయకుల పేరిట బిల్డప్ ఇచ్చుకునే వారి మాటలు నమ్మి తమ విలువైన, అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. ‘న్యూ మీడియా’ పరిధిలోకి వచ్చే యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్‌సైట్ నిర్వహణకు ఏమేమి రిజిస్ట్రేషన్లు, ఏ ఏ నివేదికలు నిర్వహించాల్సి ఉంటుందన్నది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (https://mib.gov.in)ను సందర్శించి తెలుసుకోవచ్చు. అలాగే, చాలా వరకు రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో ఉచితంగానే లభిస్తున్నాయి. మనకి మనంగా సొంతంగా చేసుకుంటే వీటి కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

‘న్యూ మీడియా’ గుర్తింపునకు తామే కృషిచేశామని ఇప్పటికే తెలంగాణకు చెందిన ఓ సంఘం ప్రచారం చేసుకుంటోంది. వాస్తవాలు ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఔత్సాహికుల నుంచి లబ్దిపొందేందుకు ఆయా వ్యక్తులు నాయకుల రూపంలో తమ ఉనికిని చాటుకుంటున్నారన్నది అర్ధమవుతోంది. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండి, తమ కోసం పనిచేస్తున్న నాయకులు ఇచ్చిన సలహాల మేరకు ముందుకు సాగితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నది గ్రహించాలి.

కేవలం ప్రకటన పులుల గాండ్రింపులను విశ్వసించి రాబోయే అక్రిడిటేషన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రింట్ మీడియాలో ప్రత్యేకించి చిన్న, మధ్యతరహా పత్రికలలో ఎన్నింటిని ప్రభుత్వం పక్కనపెడుతుందో తెలియని పరిస్థితి ఇప్పటికే కనిపిస్తోంది. జీఎస్టీ, యాన్యువల్ రిటర్ను లాంటి కఠినమైన ఆంక్షలను కొత్త విధానంలో తీసుకువచ్చిన ప్రభుత్వం ఎన్ని సంఘాలు ఎంతలా విజ్ఞప్తిచేసినా ఆయా నిబంధనలను ఉపసంహరించేందుకు అంగీకరించలేదు. గత ఏడాది అక్రిడిటేషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పుడే జీఎస్టీ నిబంధన తప్పనిసరి చేసినప్పుడు జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు ఏడాది పాటు మినహాయింపు ఉంటుందన్న సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు ఆ ఏడాది ఎలాగూ గడచిపోయింది కాబట్టి ఇప్పుడా నిబంధనను కొనసాగిస్తారా? పక్కనపెడతారా? అన్నది తెలియదు. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పుడు ఉన్న అక్రిడిటేషన్లలో దాదాపు 40 నుంచి 70 శాతం చిన్న పత్రికలకు గుర్తింపు లభించే పరిస్థితి లేదు.

(ఇది కేవలం ఔత్సాహిక ‘న్యూ మీడియా’ ప్రచురణకర్తల ప్రయోజనం కోసం ‘న్యూస్‌టైమ్’ ఇచ్చిన సలహా మాత్రమే. నచ్చితే మీ పరిధిలోని మిత్రులకు షేర్/ఫార్వర్డ్ చేయగలరని విన్నపం.)