వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్’ విడుదలపై తుది నిర్ణయం…

హైదరాబాద్, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడు అని తెలిసిన దగ్గర్నుంచి కూడా ఆయన నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని చూస్తున్నారు అభిమానులు. అన్నీ బాగుండుంటే ఆయన రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ అప్పుడెప్పుడో మే 15నే రావాల్సింది. కానీ ఏం చేస్తాం.. కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ పాడయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఒక్క మోషన్ పోస్టర్ తప్పిస్తే టీజర్ కూడా రాలేదు. షూటింగ్ మాత్రం చివరిదశకు వచ్చేసింది.

వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. ఎంసీఏ తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. అప్పట్లో దసరాకు వస్తుందని దర్శక నిర్మాతలు చెప్పినా అది నిలబెట్టుకోలేదు. దసరాతో పాటు దిపావళి, క్రిస్మస్ వెళ్లిపోయినా ఇప్పటికీ టీజర్ మాత్రం రాలేదు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్ తెరమీదకు వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్ వచ్చేస్తుందని ప్రచారం జరుగుతుంది. జనవరి 1న టీజర్ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు ‘వకీల్ సాబ్’ యూనిట్. ఆ విషయంపై నేడో రేపో క్లారిటీ రానుంది. రీ ఎంట్రీలో పవన్ ఎలా ఉంటాడా? అని చాలా మంది అభిమానులు చూస్తున్నారు. 2018 సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ వచ్చిన తర్వాత మళ్లీ ఈయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.

పైగా ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో అభిమానులకు బాకీ బాగానే పడిపోయాడు పవన్ కళ్యాణ్. రీమేక్ సినిమాతో సేఫ్ జర్నీ చేస్తున్నాడు పవన్. ‘పింక్’ కథ ఇప్పుడు పవన్ ఇమేజ్‌కు కూడా సూట్ అవుతుందని నమ్ముతున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి, నివేథా థామస్, అనన్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మగువ మగువ పాట మంచి ఆదరణ దక్కించుకుంది. సినిమాను వచ్చే మార్చిలో విడుదల చేయాలని చూస్తున్నారు. సమ్మర్ అనుకున్నా కూడా దగ్గర్లో ఎగ్జామ్స్ కూడా లేకపోవడంతో ‘వకీల్ సాబ్’ థియేటర్స్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.