నిమ్మగడ్డ రమేశ్‌కుమార్

అమరావతి, జులై 30 (న్యూస్‌టైమ్): ప్రతిష్టకు పోయి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పదవి నుంచి సాగనంపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి ఉన్నత న్యాయస్థానం ముందు శిరసావహించక తప్పలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే, నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారంలో సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ ఉంటుందని అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్ఈసీ పదవీ కాలాన్ని ఐదు నుంచి మూడేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును సవాలుచేస్తూ రమేష్‌కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో మే 29న కొట్టేసిన విషయం తెలిసిందే. రిటైర్డ్ జడ్జి వి. కనాగరాజ్‌ను ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వును కూడా జారీ చేసింది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేసే విషయంలో తాత్సారం చేస్తూ వస్తున్న విషయాన్ని నిమ్మగడ్డ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదిలాఉండగా, తన పిటిషన్‌పై మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తనను తిరిగి నియమించనందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో రమేష్‌కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తనను తిరిగి ఎస్ఈసీగా తిరిగి నియమించడానికి గవర్నర్‌కు కలవాలని హైకోర్టు సూచించిన మేరకు ఆయన గవర్నర్‌ను కలిశారు.

అందుకు అనుగుణంగా రిటైర్డ్ బ్యూరోక్రాట్ జూలై 20న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి, ఆయనను తిరిగి ఎస్ఈసీగా నియమించాల్సిందిగా కోరారు. ఈ మేరకు గవర్నర్ జూలై 21న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్‌సీ ఆర్డర్‌కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. కోర్టు ధిక్కార పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా సుప్రీం మాత్రం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు. మరో గత్యంతరం లేకపోవడంతో ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి రమేశ్‌కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.