ట్రినిడాడ్‌ దీవిలో తేలిన నిత్యానంద!

126

ట్రినిడాడ్‌, డిసెంబర్ 7 (న్యూస్‌టైమ్): దొంగ పాస్‌పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్‌ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్‌ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద దానికి ‘కైలాస’ అని పేరు కూడా పెట్టారు. తన దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్న నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక పాస్‌పోర్ట్‌ కూడా రూపొందించనున్నట్టు చెబుతున్నారు. అనేక వివాదాలతో ఇప్పటికే అనేకసార్లు పతాక శీర్షికలకు ఎక్కిన నిత్యానంద గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం’ పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు.

ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు, నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద దొంగ పాస్‌పోర్టుతో దేశం విడిచిపారిపోయాడు. అప్పటినుండి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.