సర్వర్ మొరాయించడంతో విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని ఓ రేషన్ డిపో వద్ద కార్డుదారుల పడిగాపులు

డిపోల వద్ద రేషన్‌కార్డుదారుల పాట్లు

ఇలాగైతే కరోనా మరింత పెరిగే అవకాశం

విశాఖపట్నం, అమరావతి, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): కరోనా రేషన్ సంగతేమో గానీ, డిపోల వద్ద పడుతున్న పాట్లు మహమ్మారిని ఆహ్వానించేలానే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14వ విడత రేషన్ సరుకులను పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో నేటికి ఎనిమిది రోజుల నుంచి రేషన్ డిపోల వద్ద కార్డుదారులు అవస్థలు పడుతూనే ఉన్నారు. వారం రోజులు దాటినా ఇప్పటి వరకూ చాలా మండలాలలో కనీసం 30 నుంచి 45 శాతం కార్డుదారులకు కూడా ‘రేషన్’ ఇవ్వని పరిస్థితి జిల్లాలో నెలకొందంటే ఆశ్చర్యమేస్తోంది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇవే కష్టాలు అటు కార్డుదారులను, ఇటు డీలర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలుస్తోంది. గతంలో రోజుకి ఒక్కొక్క డిపో వద్ద వంద నుండి నూటయాబై కార్డుల వరకు ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ ఇచ్చే వారు.

ఇప్పుడు పది కార్డులుకు, మించి రేషన్ ఇవ్వలేని పరిస్థితిలో డీలర్లు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సమయం అయిపోవడంతో పాటు దసరా పండగ వలన ప్రజలు రేషన్ డీలర్లపై ఒత్తిడి పెరిగిపోయి కరోనాను కూడా లెక్కచేయకుండా రేషన్ డిపోల వద్ద బారులు తీరి భారీ క్యూలైన్లో కూలి పనులు సైతం మానుకొని రేషన్ డిపోల వద్ద పడిగాపులు కాస్తున్న వారు అనేక మంది. డిలర్లకు ప్రభుత్వ ఇచ్చిన కొత్త నిబంధన మేరకు ఈసారి రెండు సార్లు బయోమెట్రిక్ కార్డుదారుల నుంచి తీసుకోవాల్సి ఉంది. గతంలో రేషన్ ఒక్కదానికే వేలుముద్ర వేస్తే సరిపోయేది. కానీ, ఇప్పుడు ఎన్ని సరుకులు ఇస్తే అన్ని సరుకులకు లబ్దిదారులు వేలుముద్ర వేయాలని నిబంధన వచ్చిచేరింది.

దీంతో ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయన్న వాదన అటు డీలర్లలోను, ఇటు కార్డుదారుల్లోనూ వినిపిస్తోంది. ఈ విధంగా ప్రజలను ఇబ్బందులు పెడితే సరుకులు మిగిలిపోతే తిరిగి ప్రభుత్వనికి మిగిలించుకోవచ్చునన్న దురుద్దేశంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటువంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ డౌన్ అవుతుండడంతో అనేక సార్లు ఆటంకాలు ఎదురవుతున్నాయి. రేషన్ షాపుల ముందు గంటల తరబడి జనం బారులు తీరి కనిపిస్తున్నారు. ఇదేదో ఈ ఒక్కసారికే వచ్చిన సమస్య కాదు… ప్రతి విడత ‘రేషన్’ పంపిణీలోనూ ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తుండగా, చాలా చోట్ల సర్వర్ సమస్యలే తలెత్తుతున్నాయి. అయితే, ఎక్కువగా డీలర్ల నిర్లక్ష్య వైఖరి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నాన్ లోకల్ కార్డులు యాడ్ కాలేదంటూ రోజుల తరబడి కార్డుదారులను డిపోల చుట్టూ తిప్పించుకుంటున్న డీలర్లు ఈ సమస్య పరిష్కారానికి మాత్రం చొరవ చూపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత సర్కిల్ పౌర సరఫరాల అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నప్పటికీ డీలర్లు ఆ దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదన్నది అంతుచిక్కడం లేదు. ఒకసారి యాడ్ అయిన కార్డు రెండో సారి యాడ్ కాలేదని ఎందుకు చూపిస్తోంది? సంబంధిత కార్డు నంబర్లను సేకరించి వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో చర్చించి పరిష్కరించవచ్చు. కానీ, అలాంటి ప్రయత్నం కనిపించడం లేదు.

దాదాపు నూటికి 95 శాతం డిపోల వద్ద భౌతిక దూరం పాటించడం అన్నది కనిపించడం లేదు. కరోనా నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం, శనగలు/కందిపప్పు తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాటిమాటికీ సర్వర్ డౌన్ అవుతుండడంతో రేషన్ పంపిణీ నిలిచిపోతోంది. దీంతో జనం గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూడాల్సి వస్తోంది. అసలే కరోనా ప్రభావం ఉండండటం జనం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిరావడం చాలాచోట్ల భౌతిక దూరం పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అనేక చోట్ల ఉదయం 4-5 గంటల నుంచే లైన్లలో నిలిచే కార్డుదారులు కనిపిస్తున్నారు. తీరా, ఈ-పాస్ యంత్రం వద్ద వీళ్ల వంతు వచ్చేసరికి బయోమెట్రిక్ పడడం లేదనో, లేక వేరే జిల్లా కార్డనో సాకులు చెప్పే డీలర్లు మరింత సమస్యగా తయారయ్యారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుందామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ ఇలాంటి అనేక అవరోధాల నడుమ సత్ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి. మళ్లీ రేపు రావడం ఎందుకులే అనుకుని డిపో వద్దే గంటల తరబడి ఎదురుచూసే కార్డుదారునికి ఆరోజే కాదు, నాలుగైదు రోజులైనా వస్తేనే టోకెన్ దొరికే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సూచనల ప్రకారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బియ్యాన్ని పంపిణీ చేయాలి. అది కూడా అంతకు ముందుగానే టోకెన్లు సరఫరా చేసిన వారికి మాత్రమే ఇవ్వాలి. కానీ సర్వర్ ప్రాబ్లంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఈ–పాస్ సర్వర్లో సమస్య తలెత్తుతోంది. దీంతో రేషన్ షాపుల్లోని బయోమెట్రిక్ యంత్రాలు సరిగ్గా పనిచేయడంలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రేషన్ పంపిణీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఉచిత బియ్యం పంపిణీని ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. మొదటి రోజు నుంచే ఈ సమస్యలు మొదలయ్యాయి. నేటికి 8 రోజులైనా సోమవారం కూడా చాలా చోట్ల ఇవే తిప్పలు. ప్రతి రేషన్ షాప్ వద్ద పర్యవేక్షణ కోసం మొదట్లో వాలంటీరు లేదా సచివాలయ సిబ్బందిని నియమించినప్పటికీ తర్వాత తర్వాత వారి జాడ కానరాకుండాపోయింది.

లబ్ధిదారుల కార్డు పరిశీలించి వివరాలు రికార్డ్ చేసుకొని ఆ అధికారే వారికి అప్రూవల్ ఇచ్చేవారు. బయోమెట్రిక్ లేకుండా సరఫరా చేస్తే డీలర్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిరయ్ణం తీసుకుంది. కానీ సర్వర్ డౌన్ అవుతుండడంతో పంపిణీ ఆలస్యమవుతోంది. సర్వర్ డౌన్‌తో ప్రధానంగా జీవీఎంసీ పరిధిలో తీవ్ర సమస్య తలెత్తుతోంది. ఇక గ్రామీణుల కష్టాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా చోట్ల చాంతాండంత క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్ డౌన్ కావడంతో కార్డుదారులకు సమాధానం చెప్పలేక కొంత మంది డీలర్లు దుకాణాలను మూసుకుని వెళ్లిపోతున్నారు. అయినా లబ్ధిదారులు మాత్రం అక్కడి నుంచి వెళ్లడంలేదు.

జీవీఎంసీ జోన్-5 పరిధిలోని చాలా డిపోలలో రోజుల తరబడి తిరిగితే తప్ప డీలర్లు సరుకులు ఇవ్వని పరిస్థితి. వలస కార్మికులు ఎక్కువగా నివాసం ఉండే ఈ జోన్‌ పరిధిలో ఎక్కువ శాతం కార్డుదారులు తమ సొంత గ్రామాలకు చెందిన కార్డులతోనే స్థానికంగా రేషన్ తెచ్చుకోవడం జరుగుతోంది. కానీ, కరోనా ఉచిత రేషన్ పేరిట ఆయా కార్డుదారులకు డీలర్లు చుక్కలుచూపిస్తున్నారు. బీసీ రోడ్డులోని నాలుగు రేషన్ డిపోల వద్దా అదే పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచే షాప్ ముందు జనం బారులు తీరినా డీలర్లు ఉదయం 10 దాటినా రేషన్ షాప్ తెరవకపోవడంతో ఓ డీలర్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితోపాటు నక్కవానిపాలెం, శ్రీహరిపురం, మల్కాపురం, భానోజీతోట, సంజీవగిరి కాలనీ, సీతారామనగర్ తదితర ప్రాంతాల్లో రేషన్ కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి విశాఖలో ఉంటున్న వారికే సర్వర్ పనిచేయడం లేదా? లేక సమస్య అంతటికీ ఉందా? అన్న విషయాన్ని మాత్రం డీలర్లు తేల్చడం లేదు.

ఈ-పాస్ సర్వర్లు పనిచేయని పక్షంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానంలో మాన్యువల్ పద్దతిలో సకాలంలో సరుకులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న డిమాండ్ చేశారు. కార్డుదారులకు ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ పేరిట నియమించిన వాలంటీర్లను ఇలాంటి సమయంలో వినియోగించుకోవడం మానేసి, సర్వర్లు, యంత్రాల పేరిట సాంకేతిక సమస్యలను సాకుగా చూపించడం సరికాదన్నారు.