నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్

135

చిత్తూరు, మార్చి 17 (న్యూస్‌టైమ్): నిష్పక్షపాతంగా, హుందాగా, సజావుగా ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.ఎస్. ప్రద్యుమ్న పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉందన్నారు.

సెక్టోరల్ అధికారులు వారి పరిధిలో గల అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వసతులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని, ఏప్రిల్ 10వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని, ఏప్రిల్ 11న ఉదయం 6 గంటలకల్లా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ కేంద్రాలలో మాక్ పోల్ నిర్వహించాలని తెలిపారు. సాధారణ ఎన్నికలలో భాగంగా చిత్తూరు జిల్లాలో జరిగే ఎన్నికలు ది బెస్ట్ ఎలక్షన్స్‌గా ఉండాలని సంకల్పం చేసుకోవాలన్నారు.

సెక్టోరల్ అధికారులకు శిక్షణలో భాగంగా మరలా మార్చి 31వ తేదీ కూడా శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈవీఎంల ప్రిపరేషన్‌లో పీఓలతో సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక వరుసలను ఏర్పాటు చేయాలని, ర్యాంపులను ఏర్పాటు చేయాలని, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు వారికి ఉచిత ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరిపిన తరువాత ఈవీఎంలు, వివిప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చిన అనంతరం 12వ తేదీ స్క్రూటినీని హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లాలో 3831 పోలింగ్ కేంద్రాలలో 700 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారని, ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ పోలీస్ ఫోర్సు వారు విధులు నిర్వహించడం జరుగుతుంది, ప్రతి ఒక్కరూ విధుల్లో భాగంగా వారి గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు.

శిక్షణలో భాగంగా ఓటింగ్ యంత్రాలు, వివిప్యాట్ల పని తీరు పోలింగ్ బృందం విధులు, ఎన్నికల సామగ్రిని పోలింగ్ నిమిత్తం తరలించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పోలింగ్ స్టేషన్‌లో విధుల నిర్వహణలో తీసుకోవలసిన ముఖ్యాంశాలు, పోలింగ్ అధికారులకు కేటాయించిన విధులు పోలింగ్ ప్రారంభానికి ముందు ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎలా సిద్ధం చేసుకోవాలనే అంశాలు, కంట్రోల్ యూనిట్‌ని సిద్ధం చేసుకొనే అంశాలు, మాక్ పోల్ నిర్వహణ పోలింగ్ ఆరంభంలో ప్రతి విషయంపై తీసుకోవలసిన జాగ్రత్తలు, పోలింగ్ స్టేషన్ లోపల, పరిసరాల ప్రాంతాలలో ఎన్నికల చట్టం అమలు గురించి చాలెంజింగ్ ఓట్లను గుర్తించడం, ప్రాక్సీ ఓటింగ్, పోలింగ్ ముగింపు ఇలా అంశాల వారీగా క్షుణ్ణంగా నిశితంగా సెక్టోరల్ అధికారులకు, నోడల్ అధికారులకు ఇప్పటికే వివరించడం జరిగిందన్నారు.