అమరావతి, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి ధాటికి గిరిపుత్రులు తల్లడిల్లారు. జీవనోపాధి దెబ్బతిని గడచిన సంవత్సరంలో ఎన్నో వెతలు అనుభవించారు. తీవ్ర సంక్షోభంలోకి వెడుతున్న పరిస్థితుల్లో కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న ట్రైఫెడ్ సంస్థ వారిని అక్కున చేర్చింది. గిరిజనుల జీవనోపాధి మార్గాలపై దృష్టి పెట్టింది. వన్ ధన్ గిరిజన అంకుర సంస్థలను, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ (ఎంఎఫ్‌పీ) అవకాశాలను వారికి అందేలా చేస్తూ ఆపత్కాలంలో ఆదుకునే సంజీవనిలా వివిధ కార్యక్రమాలను ట్రైఫెడ్ అమలు చేస్తోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), సేకరించే ఉత్పత్తుల విలువను మరింత పెంచే ఎంఎఫ్‌పీ పథకాలను గిరిజనులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. ముఖ్యంగా వన్ ధన్ స్టార్ట్ అప్‌లు విజయవంతమయ్యాయి. ఇందుకు ప్రతక్ష తార్కాణమే ఆంధ్రప్రదేశ్ గిరిజనుల విజయ గాధ.

ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో 59,18,073 మంది గిరిజన జనాభా విస్తరించి ఉంది. ఈ 13 జిల్లాల్లో 7 జిల్లాల పరిధిలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు (వీడీవీకేలు) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 263 వీడీవీకేలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 188 వీడీవీకేలు మంజూరయ్యాయి. వీటిలో 49 మందికి శిక్షణ ఇచ్చారు. 7 వన్ ధన్ వికాస్ కేంద్రాలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఇవి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78,900 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తాయి. విశాఖపట్నం జిల్లాలో అమలు ఏజెన్సీ, అమలు సంస్థగా పనిచేస్తున్న పాడేరు ఐటీడీఏ 54 వీడీవీకేల కోసం 39 అడ్డాకు ప్లేట్ల హైడ్రాలిక్ యంత్రాలు, 390 కుట్టు యంత్రాలు, 40 చింతపండు బ్లాక్ హైడ్రాలిక్ యంత్రాలను సిద్ధం చేసింది. ఈ 7 వీడీవీకేలలో ఇప్పటికే 3.48 లక్షల రూపాయల అమ్మకాలు జరిగాయి.

ఈ వీడీవీకేలలో ప్రాసెస్ చేసే చిన్న అటవీ ఉత్పత్తులలో కొండ చీపురు, వెదురు, చింతపండు, అడ్డా ఆకు ఉన్నాయి. దేవరపల్లి విడివికెలో, 15 స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు వెదురుకు విలువను ఎలా జోడించాలో, లైట్లు (దియాలు), క్యాండిల్ స్టాండ్ వంటి ఉత్పత్తులను ఎలా తయారు చేయాలనే దానిపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు ఇప్పటికే రూ.2.5 లక్షలకు పైగా అమ్మకాలు జరిగాయి. లమ్మసింగి వీడీవీకేలోని లబ్ధిదారులు 500 గ్రాములు, 1 కిలో పరిమాణంలో పిక్క తీసిన చింతపండు దిమ్మలను ఉత్పత్తి చేస్తున్నారు. దక్షిణ భారత వంటకాల్లో కీలకమైన పదార్ధంగా ఏర్పడే పిక్కతీసిన చింతపండు దిమ్మల రూపంలో ప్యాక్ చేసి ఆకర్షణీయంగా బ్రాండ్‌గా అందుబాటులోకి తెస్తున్నారు.

కొర్రాయ్ వీడీవీకేలోని 25 స్వయం సహాయక సంఘాల నుండి గిరిజన లబ్ధిదారులు వెదురు కర్రలతో కొండ చీపురును వేర్వేరు బరువులు కలిగిన వెదురు కొండ చీపులను తయారు చేస్తున్నారు. పెద్దాబయులు విడివికెలో, వివిధ స్వయం సహాయక సంఘాల (ప్రధానంగా మహిళలు) నుండి గిరిజన లబ్ధిదారులు అడ్డా ఆకులను ప్రాసెస్ చేస్తున్నారు. వాటిని స్థిరమైన, పర్యావరణ అనుకూల కప్పులు, ప్లేట్లుగా మార్చడం ద్వారా విలువను పెంచుతున్నారు. ఈ వన్ ధన్ కేంద్రాలలో తయారైన ఉత్పత్తులు మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విశేషమేమిటంటే, వచ్చే ఆదాయాలన్నీ నేరుగా గిరిజన పారిశ్రామికవేత్తలకే అందుతాయి.

నోడల్ ఏజెన్సీల సహకారంతో గిరిజన పారిశ్రామికవేత్తల గట్టి ప్రయత్నాలు, అంకితభావం ఆంధ్రప్రదేశ్‌లో వన్ ధన్ యోజనను విజయవంతం అయ్యేలా చేశాయి. రాబోయే సంవత్సరంలో 188 వన్ ధన్ వికాస్ కేంద్రాలు అమలులోకి రాబోతున్నాయి. అదనంగా, ఆంధ్రప్రదేశ్ ఉత్తరకోస్తాలో గిరిజన ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఫుడ్ పార్క్ లక్ష్యం ప్రారంభంలో, తూర్పు గోదావరి జిల్లాలోని రాంపచోడవరం వద్ద జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్, నర్సీపట్నం వద్ద కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. వచ్చే ఏడాదిలో పూర్తవుతుందని భావిస్తున్న ఈ ఫుడ్ పార్క్ ఈ ప్రాంతంలోని వందలాది మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తుంది. వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించే ఈ ప్రయత్నం గిరిజన ప్రజల ఆదాయం, జీవనోపాధిని సుగమం చేయడమే కాకుండా వారి జీవితాలలో పరివర్తనకు దారితీస్తుందని భావిస్తున్నారు.