న్యూఢిల్లీ, ఆగస్టు 4 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి విలయతాండవం భారత్‌లో కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా రికార్డుస్థాయిలో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 803 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 38,938కి చేరింది. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 52,050 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 18,55,745గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 12 లక్షల 30 వేల మంది కోలుకోగా మరో 5 లక్షల 86 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 44 వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 65.77 శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.11శాతంగా ఉంది.

ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 15,700 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. నిత్యం అక్కడ 250కిపైగా కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు, దిల్లీలలో ఇప్పటివరకూ 4వేల చొప్పున కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ 2500చొప్పున కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో కొవిడ్‌ కేసుల్లో భారత్‌ మూడోస్థానంలో ఉండగా, మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

భారతదేశం ఇప్పటివరకు 2,02,02,858 కోవిడ్-19 నమూనాలను పరీక్షించి, 2 కోట్ల పరీక్షల మైలురాయిని అధిగమించింది. కోవిడ్-19 నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంత ప్రభుత్వాలు అనుసరిస్తున్న, భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం, సమర్థవంతంగా గుర్తించడంతో పాటు ఐసోలేషన్, సకాలంలో చికిత్సనందిచడం అనే ముఖ్య వ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఇది సాధ్యమయ్యింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో, దేశవ్యాప్తంగా పరీక్షా సామర్థ్యాన్ని పెంచడానికి వీలుకలగడంతో పాటు, ప్రజలలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ నిర్ధారణా పరీక్షను సులభతరం చేసింది. గత 24 గంటల్లో 3,81,027 నమూనాలను పరీక్షించడంతో, మిలియన్ జనాభాకు సగటు పరీక్షల సంఖ్య (టి.పి.ఎం) 14,640కి పెరిగింది. ప్రస్తుతం, భారతదేశంలో మిలియన్ జనాభాకు పరీక్షల సగటు (టి.పి.ఎం). 14, 640గా ఉంది.

దేశంలో పరీక్షా కేంద్రాల సంఖ్య స్థిరంగా పెరుగుతూఉండడంతో, 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మిలియన్ జనాభాకు సగటు పరీక్షల సంఖ్య, జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదౌతోంది. దేశంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాల సామర్ధ్యం ప్రభుత్వ రంగంలో 914 ప్రయోగశాలలు, ప్రయివేటు రంగంలో 434 ప్రయోగశాలలతో మొత్తం 1,348 ప్రయోగశాలలతో నిరంతరం బలోపేతమవుతోంది. కాగా, పంజాబ్ రాష్ట్రంలో గర్భిణులకు కరోనా వైరస్ నుంచి రక్షణ దిశగా వారికి దూరవైద్య (టెలి-మెడిసిన్) సేవలందించడంలో 70 మంది మహిళారోగ్యం నిపుణులకు రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక శిక్షణనిచ్చింది. అంతేకాకుండా కోవిడ్‌-19 నిర్ధారణ అయిన గర్భిణులకు ప్రసూతి సేవలు అందించడం కోసం అన్ని జిల్లా ఆస్పత్రులలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలో దిగ్బంధం నిబంధన సడలింపు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ముంబై శివారులోని థానె, రాయ్‌గడ్ వంటి నగరాల సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించారు.

అదేవిధంగా నాసిక్, ఔరంగాబాద్, ధూలే, సాంగ్లివంటి జిల్లాల పరిధిలోగల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. మహారాష్ట్రలో 9,509 కొత్త కేసులు నమోదవగా, 9,926 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో చురుకైన కేసుల సంఖ్య 1,48,537 కాగా, కోలుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో జనం భయం వదిలి పెద్దసంఖ్యలో రోగ నిర్ధారణ పరీక్షల కోసం ముందుకొస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆదివారం 805 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం 46,587 మందికి వ్యాధి నయం కాగా, కోలుకునేవారి సగటు 73.16 శాతానికి పెరిగింది. ఇక సూరత్‌లో 209, అహ్మదాబాద్‌లో 143సహా గుజరాత్‌లో 1,101 కొత్త కేసుల నమోదుతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 63,675కు చేరింది.

ప్రస్తుతం 14,601మంది ఆస్పత్రులలో చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం 12 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 706కు చేరింది. మరోవైపు ఈ ఉదయానికి 565 కొత్త కేసులతో మొత్తం కేసులు 44,975కు పెరిగాయి. వీటిలో 12,488 యాక్టివ్‌ కేసులు కాగా, ఇప్పటిదాకా మొత్తం 29,697 మంది కోలుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 921కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 33,535కు చేరాయి. రాష్ట్ర ఆరోగ్య సమాచారపత్రం ప్రకారం- 581 మంది కోలుకోగా, ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 23,550కి చేరింది. ప్రస్తుతం 9,099 క్రియాశీల కేసులకు చికిత్స జరుగుతుండగా, ఇప్పటిదాకా 886 మరణాలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 3,246 యాక్టివ్ నియంత్రణ మండళ్లు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యాధి సోకినప్పటికీ లక్షణరహిత/స్వల్ప లక్షణాలుగల రోగుల కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 18,598 పడకలతో 157 కోవిడ్ రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

అలాగే పడకల సంఖ్యను 25వేలకు పెంచడానికి ఏర్పాట్లు చేస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇప్పుడు 2,482 క్రియాశీల కేసులున్నాయి. గోవాలో 337 కొత్త కేసులతో ఒకేరోజు అత్యధిక కేసుల రికార్డు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,530కి చేరగా, తాజాగా ఐదుగురి మరణంతో మృతుల సంఖ్య 53కు పెరిగింది. మరోవైపు క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగులకు ప్లాస్మా చికిత్స ప్రక్రియను గోవా ప్రభుత్వం ప్రారంభించింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ ఇవాళ లంబిఖోంగ్నాంగ్ఖోంగ్‌లోని మణిపూర్ ట్రేడ్ అండ్‌ ఎక్స్‌ పో సెంటర్లో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. అవసరమైతే ఈ సదుపాయాన్ని 1000 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించే వీలుంది. మిజోరం రాష్ట్రంలో ఇవాళ 8 మంది డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 482 కాగా, వాటిలో 216 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటిదాకా 266 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఇవాళ నమోదైన 194 కేసులకుగాను దిమాపూర్ 136, జున్హెబోటో 36, కొహిమాలో 22 వంతున నమోదయ్యాయి. నాగాలాండ్‌లో పరిచయాలవల్ల సోకిన కేసుల అన్వేషణ ముమ్మరం చేసిన నేపథ్యంలో అన్ని ప్రాథమిక పరిచయాలను కనుగొనగా వారంతా ప్రస్తుతం స్వీయ ఏకాంత చికిత్స పొందుతున్నారు. కేరళ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తికి నిర్లక్ష్యం, అలసత్వమే కారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కోవిడ్ విధివిధానాల అమలులో రాజీ, అజాగ్రత్త ఫలితంగా ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 102 కుటుంబ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు.

ఇకపై ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిమీద కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కేరళలో ఇవాళ మూడు మరణాల నమోదుతో మృతుల సంఖ్య 85కి చేరంది. రాష్ట్రంలో కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిన్న 1169 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, 11 రోజుల్లో 10,788 మందికి ఈ వ్యాధి సంక్రమించింది. వీరిలో 991 మందికి పరిచయాలవల్ల వ్యాధి సంక్రమించగా 56 కేసుల మూలం తెలియరాలేదు. ప్రస్తుతం 11,342 మంది చికిత్స పొందుతుండగా 1.45 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా పరిశీలనలో ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 178 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3982కు, మరణాలు 56కు పెరిగాయి.

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1515గా ఉంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు నిన్నటి నుంచి ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ కోసం గ్రేడ్-I కళాశాలకు కేటాయించిన తరహాలోనే గ్రేడ్-II కళాశాలలకూ నిధులు ఇవ్వాలని అధ్యాపకులు ఉన్నత విద్యాశాఖను కోరారు. నాగపట్టణం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఎం ఎంపీ ఎం.సెల్వరసుకు నిన్న కోవిడ్-19 నిర్ధారణ అయిన నేపథ్యంలో తాజాగా శివగంగ ఎంపీ కార్తీ పి.చిదంబరం కూడా వైరస్‌ బారినపడినట్లు సోమవారం తేలింది. చెన్నై పొరుగు జిల్లాల్లో చెంగల్పట్టు 446, కాంచీపురం 393, తిరువళ్లూరు 317 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 5875 కొత్త కేసులు, 98 మరణాలు నమోదవగా ప్రస్తుతం మొత్తం కేసులు: 2,57,613; క్రియాశీల కేసులు: 56,998; మరణాలు: 4132గా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రి నివేదికల ప్రకారం ప్రస్తుతం ఆయన ‘ఆరోగ్యం నిలకడ’గా ఉంది. రాష్ట్రంలోని కోవిడ్‌ సంరక్షణ కేంద్రాల్లో 10 రోజులుగా పడకల వినియోగం 60-65 శాతంకాగా, అటువంటి సౌకర్యాల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక బెంగళూరు నగరంలో నమోదైన కొత్త కేసులకన్నా కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. ఈ మేరకు నగరంలో 2105 కొత్త కేసులు నిర్ధారణ కాగా, 2331 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 5532 కొత్త కేసులు, 84 మరణాలు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం కేసులు: 1,34,819; క్రియాశీల కేసులు: 74,590; మరణాలు: 2496గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కోవిడ్‌ కేసులు 7500స్థాయిని దాటాయి. దీంతో నేటినుంచి వారంపాటు మచిలీపట్నంలో సంపూర్ణ దిగ్బంధం విధించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రి విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో సిబ్బంది కొరత ముఖ్యంగా, నర్సుల కొరత తీవ్రంగా ఉన్నందున రోగులు దుస్థితిలో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాలలో వీడియోలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని షిఫ్టులకూ కలిపి 100మంది నర్సులను నియమించినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతోపాటు ఒక రోజులోగా 213మంది నర్సుల నియామకం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో నిన్న 8555 కొత్త కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు: 1,58,764; క్రియాశీల కేసులు: 74,404; మరణాలు: 1474గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ సమాచారం పత్రం ప్రకారం- ప్రభుత్వ, ప్రైవేట్ బోధన ఆసుపత్రులు, తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 రోగులకు పడకల కొరత లేదు. ఈ మేరకు 14,571 పడకలు అందుబాటులో ఉండగా వీటిలో 5936 పడకలు ప్రభుత్వ ఆసుపత్రులలో సిద్ధంగా ఉన్నాయి. గత 24 గంటల్లో 983 కొత్త కేసులు, 11 మరణాలు నమోదవగా 1019మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కొత్త కేసులలో 273 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 67,660; క్రియాశీల కేసులు: 18,500; మరణాలు: 551; డిశ్చార్జి అయినవి: 48,609గా ఉన్నాయి.