యధావిధిగా వరి కోతలు

1235

హైదరాబాద్, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): లాక్‌డౌన్ అమలులో ఉన్పప్పటికీ రాష్ట్రంలో వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘లాక్‌డౌన్ కారణంగా జనజీవనం స్తంభించింది. అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, వారు ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మార్కెట్లలో రద్దీని నివారించడానికి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరికోతలు, ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరగాలి. వరికోతలకు రైతులు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితిని గ్రామాల్లో కల్పించాలి. హార్వెస్ట్ పరికరాలను బిగించే మెకానిక్‌లకు ప్రత్యేక పాసులిచ్చి అనుమతించాలి. స్పేర్ పార్ట్స్ అమ్మే షాపులను తెరవడానికి అనుమతి ఇవ్వలి. గ్రామస్తలు తమ గ్రామాల్లోకి హార్వెస్టర్లను రానివ్వాలి. ఆ తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే వాహనాలకు అనుమతివ్వాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఒకేసారి రాకుండా చూడాలి. వారికిచ్చిన కూపన్లలో పేర్కొన్న తేదీ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా రైతులను చైతన్య పరచాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కావల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. రైతుల దగ్గరి నుంచి చివరి గింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులెవరూ తొందరపడొద్దు’’ అని ముఖ్యమంత్రి కోరారు.