రాహుల్‌తో పనబాక లక్ష్మి భేటీ

882

న్యూఢిల్లీ, జనవరి 8 (న్యూస్‌టైమ్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసిందని, దేశ భవిష్యత్తు కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్ధితుల నేపథ్యంలో భారత్ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని కలిసి భవిష్యత్తు రాజకీయాలపై చర్చించానన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆంధ్ర రాష్ట రాజకీయాలు గురించి, ప్రత్యేక హోదా వంటి అనేక అంశాలపై చర్చించమని తెలిపారు. ఆంధ్రపదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయిదేళ్లు కావస్తున్నా మొండి చేయి చూపించిందన్నారు.

దాంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎ నుండి తెలుగుదేశం పార్టీ, అనేక పార్టీలు బయటకు వచ్చి, కాంగ్రెస్‌తో కలుస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసి, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తధ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ అనుసంధాన పార్టీల మధ్య ఉప్పు నిప్పులా తయారయ్యిందని, పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీలతో ప్రజలంతా కష్టాలు పడుతుండటంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో బిజెపి వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయన్నారు. చంద్రబాబు, రాహుల్ త్వరలోనే మిగతా పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.