నేటి నుండి అన్ని షాపులకు అనుమతి

35
  • రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు లాక్‌డౌన్

మచిలీపట్నం, మే 22 (న్యూస్‌టైమ్): శుక్రవారం నుండి ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు అన్ని షాపులు తెరవవచ్చని బందరు ఆర్‌డివో ఎన్ఎస్‌కె. ఖాజావలి వెల్లడించారు. గురువారం తన కార్యాలయంలో కోవిడ్ -19 టాస్క్‌పోర్సు సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో కోవిడ్ -19 తాజా ప్రభుత్వ నిబంధనలు గురించి క్షుణ్ణంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్‌డివో వెల్లడిస్తూ శుక్రవారం నుండి ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు అన్ని షాపులు తెరవవచ్చని, అయితే బంగారు, రెడీమెడ్, చెప్పుల షాపులు తెరవడానికి అనుమతి లేదన్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు పూర్తి స్దాయిలో లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్నారు.

మెడికల్ షాపులు 24 గంటలు తెరవచ్చన్నారు. షాపులో ఒకే సారి 5 గురికి మించి అనుమతించకూడదని వినియోగదారులు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ఈ విషయాలు షాపుల వద్ద బోర్డులపై రాసి ప్రదర్శించాలన్నారు. షాపులో పని చేసే వర్కర్లు 50 శాతం మించకూడదని అయితే షిప్టులుగా పని చేయవచ్చన్నారు. బార్బర్ షాపుల యాజమానులు మాస్కులు, గ్లోవుజ్‌లు ధరించి పని చేసుకోవచ్చునని వినియోగదారులు కూడా మాస్కులు ధరించాలని అన్ని షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

హోటళ్లు, రెస్టారెంట్లు పార్శిల్స్ మాత్రమే విక్రయించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది నూరు శాతం హాజరుకావాలన్నారు. బట్టల షాపుల్లో ట్రైయల్ రూమ్స్ అనుమతి లేదన్నారు. మచిలీపట్నంలో మొత్తం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వీరిలో ఒకరు మరణించగా మిగత 6గురు చికిత్స అనంతరం కొలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారని ఆర్‌డివో తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన 3 ప్రాంతాలు చిలకలపూడి, సుకర్లాబాద, గాంధీనగర్ లలో రెడ్‌జోన్లు ఏర్పాటు చేయగా చిలకలపూడి ఏరియాలో 28 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కానందున రెడ్‌జోన్ డినోటిఫై చేసి గ్రీన్ జోన్‌లోకి తేవడం జరిగిందన్నారు. అదే విధంగా పాజిటివ్ కేసులు నమోదు కాని పక్షంలో ఈ నెల 24 నుండి సుకర్లాబాద, జూన్ 5వ తేది నుండి గాంధీనగర్‌లు కూడా గ్రీన్ జోన్‌లోకి వస్తాయని అన్నారు. తద్వారా జూన్ 5 నుండి పట్టణమంతా బందరు డివిజన్ గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్‌డివో పేర్కొన్నారు.

మున్సిపల్ కమీషనర్ ఎస్. శివరామకృష్ణ మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్ చాలా వరకు సడలింపులు ఇవ్వడం జరిగిందని ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలో తాత్కాలిక రైతుబజార్లు యాథావిధిగా కొనసాగుతాయని అన్నారు. వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన ప్రభుత్వ సేవలు పొందవచ్చని ప్రతి రోజు సచివాలయాల వద్ద స్పందన అర్జీలు అందజేయవచ్చన్నారు. ఈ సమావేశంలో సీఐలు వెంకటేశ్వరరావు, వెంకట నారాయణ, సహాయ సిటీ ప్లానర్ నాగశాస్త్రులు, తహసిల్దారు డి. సునీల్‌బాబు పాల్గొన్నారు.