ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీవైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి

విజయవాడ, అక్టోబర్ 8 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు ఎట్టకేలకు ప్రభుత్వం అనుమించింది. అన్‌లాక్ 5.0 సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. షూటింగ్ సమయాల్లో కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరి చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్ము, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ) లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తూ ఉత్తరువులు జారీచేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందని, చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే అన్నారు. అయితే, భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న జారీచేసిన మార్గదర్శకాలు, స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు.

సినిమా షూటింగ్ దృశ్యం (File photo)

సినిమాల చిత్రీకరణ సమయంలో ఈ మార్గదర్శకాలను, స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు దరించాల్సి ఉందని, అయితే, షూటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూనిట్లు, సెట్లు అన్నీ కూడా తరచుగా శానిటైజ్ చేయాల్సి ఉంటుందన్నారు. చేతులు కడుక్కునే సౌకర్యం లేని పక్షంలో అందరు టెక్నీషియన్లు, నటీనటులు హ్యండ్ శానిటైజర్లను తప్పక వినియోగించాలని ఆయన సూచించారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితుల మినహా మిగిలి సమయాల్లో టెక్నీషియన్లు అందరూ ఆరు అడుగుల కనీస దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చే బహిరంగ సందేశాన్ని చిత్రప్రదర్శన ప్రారంభం, విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబంధనలు, ఇతర వివరాలను రాష్ట్ర ఫిల్ము, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.in నుండి పొందవచ్చని ఆయన తెలిపారు.