న్యూఢిల్లీ, మే 3 (న్యూస్‌టైమ్): యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సోమ‌వారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. భార‌త‌దేశంలో, యూరోపియ‌న్ యూనియ‌న్ (ఇయు)లో ప్ర‌స్తుతం నెల‌కొన్న కోవిడ్‌-19 స్థితితో పాటు, కోవిడ్-19 తాలూకు రెండో వేవ్‌ను అదుపులోకి తీసుకురావ‌డం కోసం భార‌త‌దేశం చేస్తున్న ప్ర‌యత్నాల‌ను గురించి నేత‌లు ఇరువురు ఒక‌రి ఆలోచ‌న‌ల‌ను మ‌రొక‌రికి తెలియజెప్పుకొన్నారు. కోవిడ్‌-19 తాలూకు రెండో వేవ్‌కు వ్య‌తిరేకంగా భార‌త‌దేశం చేస్తున్న యుద్ధానికి త‌క్ష‌ణ మ‌ద్ధ‌తును కూడ‌గ‌ట్టినందుకు ఇయును, ఇయు స‌భ్య‌త్వ దేశాలను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు.

జులైలో జ‌రిగిన కడపటి శిఖర స‌మ్మేళ‌నం జరిగిన త‌రువాత నుంచి భార‌త‌దేశం-ఇయు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఒక స‌రి కొత్త వేగ‌ గ‌తిని అందుకొంద‌ని వారు గుర్తించారు. ఈ నెల 8న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌రుగ‌నున్న ఇండియా-ఇయు నేత‌ల స‌మావేశం ఇప్ప‌టికే బ‌హు ముఖాలుగా విస్త‌రించిన‌టువంటి ఇండియా-ఇయు సంబంధాలకు ఒక స‌రి కొత్త జోరును అందించేందుకు ల‌భించిన ఒక ముఖ్య‌మైన అవ‌కాశ‌మే అంటూ నేత‌లిద్దరూ వారి స‌మ్మ‌తిని వ్య‌క్తం చేశారు. ఇండియా-ఇయు నేత‌ల స‌మావేశం ఇయు+27 న‌మూనాలో జ‌రిగే ఒక‌టో స‌మావేశం కానుంది. అంతేకాదు, ఇండియా-ఇయు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత‌గా బ‌ల‌ప‌ర‌చుకోవాలంటూ ఇరు ప‌క్షాలు వ్య‌క్తపరుస్తున్న ఆకాంక్ష‌ను ఇది ప్రతిబింబిస్తోంది.